![]() |
![]() |

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బాటలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెళ్తున్నాడా? అవుననే చెప్పక తప్పదు. ఇంతకీ ఏ విషయంలో.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఏడేళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే.
ఓ సారి మహేశ్ తాలూకు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. గతంలో మూడేళ్ళ పాటు సంక్రాంతినే టార్గెట్ చేసుకుని వరుస సినిమాలతో సందడి చేశాడు మహేశ్. 2012 సంక్రాంతికి ‘బిజినెస్‌మేన్’గా జనం ముందు నిలిచిన మహేశ్ బాబు.. 2013లో మళ్ళీ ముగ్గుల పండగనే లక్ష్యంగా చేసుకుని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంటూ సందడి చేశాడు. అంతటితో ఆగకుండా మళ్ళీ ఏడాది గ్యాప్‌తో పతంగుల పర్వదినాన్ని టార్గెట్ చేసుకుని ‘1:నేనొక్కడినే’ అంటూ మురిపించాడు. అలా.. 2012, 2013, 2014 సంవత్సరాల్లో సంక్రాంతి పండుగను తన వరుస సినిమాల విడుదలకు వేదికగా చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఓ కథానాయకుడి మూడు వరుస సినిమాలు సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేసుకుంటూ రిలీజ్ కావడం అరుదైన విషయమనే చెప్పాలి. మహేశ్ విషయంలో ఏడేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఆ అరుదైన వ్యవహారమే.. ఇప్పుడు రజనీకాంత్ విషయంలోనూ రిపీట్ అవుతుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. 2019 పొంగల్‌కి రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘పేట్ట’(తెలుగులో ‘పేట’ పేరుతో అనువాదం అయింది) విడుదల కాగా.. మళ్ళీ ఏడాది తరువాత అదే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని తన నెక్స్ట్ ఫిల్మ్ ‘దర్బార్’ విడుదలైంది. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘అణ్ణాత్తే’ కూడా పొంగల్‌నే టార్గెట్ చేసుకుని వచ్చే సంవత్సరం జనవరి 14న రాబోతోంది. మొత్తానికి.. ఏడేళ్ళ క్రితం మహేశ్ ఎలాగైతే మూడేళ్ళ పాటు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని తన వరుస చిత్రాలతో పలకరించాడో.. అలాగే రజనీకాంత్ కూడా పొంగల్ బరిలోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌తో మూడు సార్లు పలకరిస్తుండడం విశేషం.
![]() |
![]() |