![]() |
![]() |

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం భారతీయ చిత్రసీమలోని ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి (నెపోటిజం)పై ఎన్నటికీ తెగని చర్చకు దారితీసింది. తాజాగా నెపోటిజంను సమర్థిస్తూ రామ్‌గోపాల్ వర్మ మాట్లాడటం, కరణ్ జోహార్‌ను వెనకేసుకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాలీవుడ్లో నెపోటిజం పెరగడానికి కరణ్ జోహార్ కారకుడంటూ ఆయనపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. సుశాంత్ డిప్రెషన్‌ను గురవడానికి కూడా పరోక్షంగా ఆయనే కారణమంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే కరణ్ జోహార్‌ను వెనకేసుకు వస్తూ ట్విట్టర్ వేదికగా మాట్లాడాడు ఆర్జీవీ.
"జరిగిన దానికి కరణ్ జోహార్‌ను నిందించడం రిడిక్యులస్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేనితనాన్ని అది తెలియజేస్తోంది. సుశాంత్‌తో కరణ్‌కు సమస్య ఉందనుకున్నప్పటికీ, తాము ఎవరితో పనిచేయాలని ఏ దర్శక నిర్మాతలైనా ఎలా అనుకుంటారో అలాగే ఎవరితో తను పనిచేయాలనేది కరణ్‌కు ఉన్న ఛాయిస్." అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ ఎపిసోడ్లో కరణ్‌ను పెద్ద బాధితుడిగా ఆయన పేర్కొనడం గమనార్హం. “Just want to say this to the ignorant social lynch mob that @karanjohar is a bigger victim in this context compared to their ill perceived and suddenly discovered victim Sushant,” అని వర్మ తెలిపాడు.
సమాజానికి నెపోటిజం ఆధారమని ఆయన అభిప్రాయపడ్డాడు. "నెపోటిజం లేకపోతే సొసైటీ కొలాప్స్ అవుతుంది. కారణం.. సామాజిక నిర్మాణంలో బంధుప్రీతి అనేది ప్రాథమిక సూత్రం.. ఎలాగంటే.. ఎదుటి వ్యక్తి భార్యను మీరు మరింతగా ప్రేమించలేరు, ఇతరుల పిల్లల్ని కూడా మరింతగా మీరు ప్రేమించలేరు." అని ఆయన రాసుకొచ్చాడు.
![]() |
![]() |