![]() |
![]() |
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనుకున్నట్టుగానే బాక్సాఫీస్‌ను బద్దలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఇప్పుడు సలార్ ఫీవర్‌లో ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత తన సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన ప్రభాస్‌కు జేజేలు పలుకుతున్నారు అభిమానులు. ఇక సినిమా రంగం నుంచి ‘సలార్’ టీమ్‌కి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఆనంద సమయంలో మెగాస్టార్ చిరంజీవి సలార్ టీమ్‌కి అభినందనలు తెలియజేయడం అభిమానులకు మరింత కిక్కునిస్తోంది. ఇంతటి ఘనవిజయం సాధించిన ‘సలార్’ టీమ్‌కి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు చిరంజీవి.
‘హృదయపూర్వక అభినందనలు మైడియర్ దేవా’ అంటూ చిరు చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తమ అభిమాన హీరోకి అభినందనలు తెలియజేయడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద మంటలు పుట్టిస్తోందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కూడా మెగాస్టార్ ప్రశంసిస్తూ.. ‘ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్‌కు అభినందనలు. ఈ ప్రపంచ నిర్మాణంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, ఆద్యగా శృతిహాసన్, కర్తగా జగపతిబాబు అద్భుతంగా నటించారు. వారికి నా అభినందనలు. ఇంత గొప్ప సినిమాలో భాగమైన సినిమాటోగ్రాఫర్ భువన్‌గౌడ, సంగీత దర్శకుడు రవి బస్రూర్ , ఆర్ట్ డైరెక్టర్ చలపతి, యాక్షన్ డైరెక్టర్ అన్బరివ్, నిర్మాత విజయ్ కిరగందూర్‌లతోపాటు మిగతా యూనిట్ సభ్యులకు కూడా నా అభినందనలు’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
చిరంజీవి ట్వీట్‌కి పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ ‘థాంక్ యు సర్’ అని సమాధానమిచ్చారు. ఇక ప్రభాస్ అభిమానులు మెగాస్టార్‌కు థాంక్యూ బాస్ అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. తమ అభిమాన హీరో ప్రభాస్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమని, అందుకే ఎప్పుడూ తన ప్రేమను చూపిస్తుంటారని ఎంతో ఆనందంగా చెబుతున్నాడు అభిమానులు. చిరంజీవికి ప్రభాస్‌తో ఎంతో అనుబంధం ఉంది. అలాగే ప్రభాస్‌కి రామ్‌చరణ్ మంచి మిత్రుడు. గతంలో ‘సాహో’ టైమ్‌లో కూడా చిరంజీవి.. ప్రభాస్‌ను అభినందిస్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే ప్రభాస్ కూడా చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటారు.
![]() |
![]() |