![]() |
![]() |

జనంలో కలిసిపోయిన ఆయన ఓ సాధారణ వ్యక్తిలానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తన బ్యాగ్రౌండ్ గురించి చెప్పాడో.. కాలం, పరిస్థితులు ఆయనను ఏ పని చేయిస్తున్నాయో అర్థమవుతుంది. ఆయన పేరు రామ్ వృక్ష గౌర్. ఈ పేరు విన్న జ్ఞాపకం లేకపోవచ్చు కానీ, 'చిన్నారి పెళ్లికూతురు' (బాలికా వధు) సీరియల్ డైరెక్టర్ అంటే మాత్రం ఆసక్తి కలగకుండా ఉంటుందా!? ఇప్పుడాయన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ నగరంలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు!
"ఒక సినిమా రెక్కీ కోసం ఆజంగఢ్‌కు వచ్చాను. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్ విధించారు. దాంతో నేను వెనక్కి వెళ్లలేకపోయాను. మేం ఏ సినిమా కోసమైతే వర్క్ చేస్తున్నామో, ఆ సినిమా ఆగిపోయింది. దానిపై వర్క్ స్టార్టవడానికి ఇంకో సంవత్సరం కానీ, అంతకంటే ఎక్కువ టైమ్ కానీ పడుతుందని మా ప్రొడ్యూసర్ చెప్పారు. అప్పుడు మా నాన్న చేసే వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకొని, తోపుడుబండి మీద కూరగాయలు అమ్మడం మొదలుపెట్టాను. ఈ వ్యాపారం నాకు అలవాటైందే. దీనికి నేనేం బాధపడట్లేదు." అని ఆయన చెప్పాడు.
రామ్ వృక్ష తన కెరీర్ గురించి మాట్లాడుతూ, "రైటర్ అయిన నా ఫ్రెండ్ షానవాజ్ ఖాన్ సాయంతో 2002లో నేను ముంబైకి వెళ్లాను. టీవీ సీరియల్స్‌లో మొదట లైట్ డిపార్ట్‌మెంట్‌లో, ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఆ తర్వాత చాలా సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి, అప్పుడు 'చిన్నారి పెళ్లికూతురు' (బాలికా వధు) సీరియల్‌కు ఎపిసోడ్ డైరెక్టర్‌గా, యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాను." అని తెలిపాడు. ఆయన సినీ రంగంలోనూ పనిచేశాడు. యశ్‌పాల్ శర్మ, మిళింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హూడా, సునీల్‌శెట్టి లాంటి యాక్టర్ల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయనది.
కరోనా మహమ్మారి తలెత్తక ముందు ఓ భోజ్‌పురి సినిమాకూ, ఓ హిందీ సినిమాకూ డైరెక్టర్‌గా చేయడానికి ఆయన ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. "ముంబైలో నాకు సొంత ఇల్లు ఉంది. ఒకరోజు తిరిగి నా ఇంటికి వెళ్తాను. అప్పటిదాకా, ఇక్కడ ఈ పని చేసుకుంటూ ఉంటాను." అని చెప్పాడు రామ్ వృక్ష.
![]() |
![]() |