![]() |
![]() |

ఆసుపత్రిలో తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించామని ఎస్పీ చరణ్ తెలిపారు. చెన్నైలో ఎంజిఎం ఆసుపత్రి వర్గాలతో కలిసి సోమవారం ఆయన విలేకరుల ముందుకు వచ్చారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు అందరూ ఆవేదనలో ఉన్నప్పుడు బిల్లు కట్టనందుకు భౌతిక కాయాన్ని ఇవ్వలేదని కొందరు అవాస్తవాలు ప్రచారం చేయడం తమను ఎంతో కలచివేసిందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన మరోసారి ఖండించారు. ఇంతకు ముందు ఆదివారం ఈమేరకు సోషల్ మీడియాలో ఒక ఆవిడ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
"మా నాన్నగారు ఆసుపత్రిలో చేరినప్పట్నుంచి ఎంజిఎం వైద్యులు, సిబ్బంది ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నాన్న ఆరోగ్యం మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేశారు. ప్రతి రోజూ, ప్రతి పరీక్షకూ, మందులకు అయిన ఖర్చును ఎప్పటికప్పుడు మాకు తెలియజేశారు. మాకు బిల్లులు ఇచ్చారు. చికిత్సకు అయిన ఖర్చులో కొంత మేము కట్టగా... మిగిలినది బీమా కంపెనీ చెల్లించింది" అని ఎస్పీ చరణ్ అన్నారు.
బిల్లు కట్టలేదని భౌతిక కాయం ఇవ్వలేదన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ "నాన్న మరణించిన రోజు నా స్నేహితుడైన వైద్యుడు విధి నిర్వహణలో ఉన్నారు. 'మొత్తం ఎంత ఖర్చు అయింది? ఎప్పుడు చెల్లించాలి?' అని అడిగా. 'ఇప్పుడు ఏమీ వద్దు. తర్వాత చూసుకుందాం' అన్నాడు. ఆసుపత్రి అకౌంటెంట్‌ను బిల్లు విషయమై అడిగాను. 'చరణ్ దగ్గర బిల్లు గురించి ఏం మాట్లాడొద్దు. బాలుగారి భౌతికకాయాన్ని తరలించేందుకు అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తిచేసి పంపండి' అని ఎంజీఎం డైరెక్టర్ తనతో చెప్పారని అకౌంటెంట్ వివరించారు" అని ఎస్పీ చరణ్ అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం నమ్మవద్దని కోరారు. నాన్న ఎప్పుడైతే మృతి చెందారో అప్పుడే తాను ఆ విషయం ప్రకటించాననీ, అంతే కానీ, నాన్న ఆ ముందు రోజే మృతి చెందారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆయన స్పష్టం చేశారు.
![]() |
![]() |