![]() |
![]() |

సాధారణంగా హీరోయిన్ కెరీర్ స్పాన్ పదేళ్లుంటే గొప్పగా భావించే ఈ కాలంలో ఏకంగా సుమారు రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా రాణిస్తూ రావడం అసాధారణం కిందే లెక్క. అలాంటి అసాధారణ నాయిక శ్రియా శరణ్. అందచందాలు, అభినయ సామర్థ్యం, అపురూప నాట్య ప్రతిభ కలిసి శ్రియను తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారగా మార్చాయి. ప్రస్తుతం ఆమె నాయికగా 'గమనం' అనే సినిమా రూపొందుతోంది. రెండేళ్ల క్రితం చడీచప్పుడు కాకుండా రష్యాకు చెందిన నేషనల్ టెన్నిస్ ప్లేయర్, హోటల్ యజమాని ఆంద్రీ కొశ్చీవ్‌ను వివాహమాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రియ.
.jpg)
నిజానికి ఆ పెళ్లి వార్తను కూడా మొదట శ్రియ ధ్రువీకరించకపోవడం గమనార్హం. 2018 మార్చి 17న ముంబై మిర్రర్ టాబ్లాయిడ్.. శ్రియ రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని బయటపెట్టింది. అయితే ఆ విషయాన్ని ఆమెను అడిగినప్పుడు "దానిపై నేను కామెంట్ చేయాలని అనుకోవట్లేదు" అని చెప్పడం ఆశ్చర్యకరం. కానీ, ఆ తర్వాత ఆ పెళ్లి బహిరంగ రహస్యంగా మారి, ఆమె పెళ్లి ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
.jpg)
ముంబై మిర్రర్ వార్త వచ్చిన మరుసటి రోజు నుంచే రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శ్రియ, ఆంద్రీ పెళ్లి పనులు మొదలయ్యాయి. 2018 మార్చి 18న పసుపు కుంకుమ వేడుక, హోలీ పార్టీ, సంగీత్ వేడుక జరిగితే, మార్చి 19న ఉంగరాలు మార్చుకోవడం, పెళ్లి తంతు, రిసెప్షన్ డిన్నర్ జరిగాయి. మీడియా దృష్టికీ, పాపరాజ్జి దృష్టికీ అందకుండా పర్సనల్ లైఫ్‌ను గడపడానికి ప్రాధాన్యం ఇస్తుంది శ్రియ. బాయ్‌ఫ్రెండ్ ఆంద్రీతో అనుబంధాన్నీ ఆమె అలాగే రహస్యంగా ఉంచింది. అదివరకెన్నడూ ఆమె బహిరంగంగా అతడితో కలిసి కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాలోనూ అతడితో కలిసున్న ఫొటోలను షేర్ చెయ్యలేదు.

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన ఆంద్రీ కొశ్చీవ్‌కు మాస్కోలో ఒక రెస్టారెంట్ చైన్ ఉంది. జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడాడు. పెళ్లికి ముందు వరకు తల్లి, సోదరునితో కలిసి ఉండేవాడు. ప్రస్తుతం శ్రియ, ఆంద్రీ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో ఉంటున్నారు.
![]() |
![]() |