![]() |
![]() |

అదివరకు 'సుడిగాడు' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 4 షోతో తెచ్చుకున్న గుజరాతీ అమ్మాయి మోనాల్ గజ్జర్ చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. అయితే అది ఓ స్పెషల్ సాంగ్‌తో కావడం గమనార్హం. అవును. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న 'అల్లుడు అదుర్స్'లో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే ఈ పెప్పీ నంబర్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ స్పెషల్ సాంగ్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మోనాల్ గజ్జర్‌తో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్లొనబోతోంది.
'రాక్షసుడు' లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
పండగ సీజన్లలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' చిత్రం వారికి సరైన చాయిస్ అని కచ్చితంగా చెప్పవచ్చని చిత్ర బృందం అంటోంది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నాయికలుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోను సూద్, వెన్నెల కిశోర్, సత్యా కీలక పాత్రధారులు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
![]() |
![]() |