![]() |
![]() |

"ఈ సినిమా ఎప్పుడు విడుదలై బ్రహ్మాండంగా ఆడుతోందో, జనం బీభత్సంగా వస్తున్నారో, తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, భారతదేశంలోని ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక ధైర్యం వచ్చింది.. మా సినిమాలు కూడా మేం రిలీజ్ చేస్తామని. జనవరి 1న, సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో.. వాటన్నింటికీ ఓ దిక్సూచిగా, మార్గదర్శిగా నిలిచింది సోలో బ్రతుకే సో బెటర్." అంటూ అభినందించారు అభ్యుదయ చిత్రాల కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'సోలో బ్రతుకే సో బెటర్' థ్యాంక్యూ మీట్‌కు ఆయన అతిథిగా వచ్చి మాట్లాడారు.
"ఈ కరోనా కష్టకాలంలో ప్రపంచపరంగా మొత్తం మానవజాతి అల్లకల్లోలం అవుతున్న దశలో.. మన సినిమావాళ్లం మళ్లీ మన సినిమాలు రిలీజవుతాయా, థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? అనుకొనే భయంకర పరిస్థితుల్లో, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు ఈ పరిశ్రమ మీద ఆధారపడివున్న దశలో, వలస కార్మికుల్లాగా సినిమా కార్మికుల భవిష్యత్తు ఏమిటి? అనే మీమాంసలో ఉన్న దశలో, తెలుగు సినిమా పరిశ్రమ ఏమీ కాదు, భగవంతుడు చాలా గొప్పవాడు, లాక్‌డౌన్ పోతుంది, కరోనా వైరస్ నశిస్తుంది, మళ్లా థియేటర్లు తెరుస్తారు, ప్రేక్షక దేవుళ్లు వచ్చి ఆశీర్వదిస్తారు, మళ్లా ఇలా ప్రెస్‌మీట్‌లు పెట్టుకొని, విజయయాత్రలు చేస్తూ, 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ముందుకు వచ్చి ఇవేళ ఇలా ప్రెస్‌మీట్ పెట్టుకోవడం మామూలు ఆనందంగా లేదు. తెలంగాణలో కేసీఆర్ గారు, ఏపీలో జగన్మోహన్‌రెడ్డి గారు సినిమావాళ్లకు ఏం కష్టాలున్నాయో చెప్పండి, మేం రాయితీలిస్తాం అనడమే కాకుండా, థియేటర్లు తెరుచుకోండని చెప్పడమే కాకుండా, ప్రేక్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం పాటిస్తూ నడుపుకోండని చెప్పినందుకు వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా." అని ఆయన అన్నారు.
ఆ మహామహుల మధ్య నన్ను పెట్టారు..
"ఇవాళ దేశం మొత్తమంతా.. ఓటీటీమయమైపోయింది, టీవీలమయమైపోయింది, ఇళ్లకే పరిమితమైపోతున్నారు, థియేటర్లకు వచ్చి ఎవరైనా సినిమా చూస్తారా?.. అనే దశలో, చూస్తారు అని ప్రూవ్ చేసిన ప్రప్రథమ పెద్ద సినిమా ఈ 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ క్రెడిట్ మొదట హీరో సాయిధరమ్ తేజ్‌కు దక్కుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ మీట్‌కు నన్ను కూడా పిలవడానికి కారణం మా సుబ్బు (డైరెక్టర్) సార్. ఒక పక్క వాజ్‌పేయి గారు, అబ్దుల్ కలాం గారు, నేను, మమతా బెనర్జీ, మదర్ థెరిసా.. ఆ మహామహుల మధ్యలో నా కటౌట్ పెట్టి, నా వేషాన్ని చూపించడం మామూలు ఆనందంగా లేదు. అందులో హీరో సాయితేజ్ నా ఫ్యాన్ అంట. ఆ మహానుభావుడి సంస్కారానికి వందనం. దర్శకుడికి దండం. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది, మీ వేషం చాలా బాగుంది, బాగా చెప్పారు అంటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మహామహుల మధ్య నన్ను నిలబెట్టి, హీరోని నా ఫ్యాన్‌ని చేసి, పెళ్లంటే నూరేళ్ల పంట.. ఓ యువతీ యువకుల్లారా.. మీరంతా చాలా గొప్పవాళ్లవ్వాలని, ఆ అయ్యేదశలో, ఆశయంలో ఎక్కడ పెళ్లి అడ్డంకిగా వస్తే, నా భవిష్యత్తు ఏమవుతుందో, నేననుకున్నది సాధించలేనేమో అనే మీమాంసలో చాలా మంది యువతీయువకులు ఇవాళ పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారు. అలాంటి దశలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఎప్పుడు గ్యారంటీ.. వయసైపోతే పరిస్థితేంటి? కాబట్టి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.. అనే గొప్ప మెసేజ్‌ని చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు సుబ్బు. ఇలాంటి గొప్ప చిత్రంలో నాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్రనిచ్చి, ఇంత ఎంకరేజ్ చేసినందుకు దర్శక నిర్మాతలకు, హీరోగారికి నా వందనాలు." అని చెప్పారు నారాయణమూర్తి.
టిక్కెట్ రేట్లు పెంచడం ఆథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్..
"బాగా ఆడుతున్న ఈ సినిమాకి ఇంకా జనం రావాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ సినిమాని నిర్మాత ప్రసాద్‌గారు రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి టిక్కెట్ రేట్లు పెంచకండి. థియేటర్లలో సగం ఆక్యుపెన్సీయే ఉంది కాబట్టి టిక్కెట్ రేట్లు పెంచుకుంటేనే కానీ వర్కవుట్ కాదు అనే దశకు దయచేసి పోవద్దు. ప్రేక్షక దేవుళ్లు లేకపోతే సినిమా లేదు. సినిమా తీసేవాళ్లు, చూసేవాళ్లు, ప్రదర్శించేవాళ్లు.. ఈ ముగ్గురూ బాగుండాలి. అందరూ కష్టాలు పడుతున్నారు. టిక్కెట్ రేట్లు పెంచి, కోట్లు సంపాదించుకోవడమనేది కరెక్ట్ కాదండి. టిక్కెట్ రేట్లు పెంచి సినిమా చూపిస్తే, అది ఆథరైజ్డ్ బ్లాక్ మార్కెటింగ్. దాన్ని ఖండించాలి. కేసీఆర్ కానీ, జగన్మోహన్‌రెడ్డి కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమా బాగుంటే ఎంతకాలమైనా చూస్తారు. అలా స్వచ్ఛంగా ఉందాం.. అని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.
సాయితేజ్, నభా నటేశ్ జంటగా నూతన దర్శకుడు సుబ్బు రూపొందించిన సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
![]() |
![]() |