![]() |
![]() |

తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. జూన్ 4వ తేది బాలు జయంతి (పుట్టినరోజు). ఆ సందర్భంగా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ తెయలిజేస్తూ, ‘‘బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10గంటల నుండి రాత్రి 10 గంటలవరకు 12గంటల పాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్ చేస్తున్నాం. పాటల కచేరితో ఆ మహనీయుణ్ని గుర్తు చేసుకోవటం మేమందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం’’ అన్నారు.
యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ, ‘‘30ఏళ్ల చరిత్ర ఉన్న మా సినిమా మ్యూజిక్ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్ సభ్యులకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్‌ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు. దురదృష్టవశాత్తూ ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్ ప్రతినిధులుగా నేను, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే’’ అన్నారు.
ట్రెజరర్ రమణ శీలం మాట్లాడుతూ, ‘‘తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు అని అనుకుంటున్నాం. కాబట్టి వారి జన్మదినాన్ని పెద్ద పండుగలా చేస్తున్నాం.’’ అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు మాట్లాడుతూ, ‘‘బాలుగారి టీమ్‌లో మ్యూజిషియన్‌గా దాదాపు 25 ఏళ్ల పాటు పనిచేశాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమంలో పాల్గొని మీరు ఆనందించి మమ్మల్ని మా యూనియన్‌ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ, ‘‘బాలుగారంటే మా జనరేషన్ సింగర్స్ అందరకీ ఇన్‌స్పిరేషన్. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది. జూన్ 4న ఆయనని మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇకనుండి నా వంతుగా మా యూనియన్‌కి ఎప్పుడూ నా సహాయసహకారాలు అందిస్తాను’’ అన్నారు.
సింగర్ కౌసల్య మాట్లాడుతూ, ‘‘వందమందికి పైగా సింగర్స్ పాల్గొని దాదాపు 12గంటలపాటు బాలుగారికి స్వర నీరాజనాన్ని అందించబోతున్నాం. మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

![]() |
![]() |