![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ - యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ కె.ఎస్.ఆర్. దాస్.. మాస్ ఆడియన్స్ మెచ్చిన కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో `హంతకులు - దేవాంతకులు` ఒకటి. ఇందులో సీఐడి రాజేశ్ గా కృష్ణ తన అభినయంతో ఆకట్టుకోగా.. అతని జోడీగా జ్యోతిలక్ష్మి మురిపించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రతినాయకుడిగా ఎంటర్టైన్ చేసిన ఈ సినిమాలో నగేశ్, సత్యనారాయణ, త్యాగరాజు, కేవీ చలం, రాజసులోచన, అనిత, జయకుమారి, నిర్మల, ముక్కామల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ సినిమాకి విజయ బాపినీడు కథను అందించగా.. దర్శకరత్న దాసరి నారాయణ రావు సంభాషణలు సమకూర్చారు. తరువాతి రోజుల్లో అటు విజయ బాపినీడు, ఇటు దాసరి దర్శకులుగా రాణించడం విశేషం.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రంలో ``ఇది లక్కీ లక్కీ ఆట``, ``చినుకు పడుతున్నది``, ``అడుగులు కదిపి ఆడలేను`` అంటూ మొదలయ్యే పాటలన్నీ రంజింపజేశాయి. ఎస్.ఆర్. కంబైన్స్ పతాకంపై యన్. వి. సుబ్బరాజు, ఎమ్. కె. రాధ సంయుక్తంగా నిర్మించిన `హంతకులు - దేవాంతకులు`.. 1972 జూన్ 2న విడుదలై ప్రజాదరణ పొందింది. కాగా, నేటితో ఈ సినిమా 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |