![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ కలల ప్రాజెక్ట్ 'నర్తనశాల' సినిమా ప్రారంభమై, అర్ధంతరంగా ఆగిపోయింది. కారణం అందులో ద్రౌపది పాత్రను పోషిస్తోన్న సౌందర్య అకాల మరణం. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన పర్ణశాల సెట్‌లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అర్జునునిగా బాలకృష్ణ, భీమునిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు, నకుల సహదేవులుగా నవీన్, వినయ్ నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు బాలకృష్ణ. ఆయనే ఈ సినిమాకు దర్శకుడు కదా!
అయితే ఏప్రిల్ 17న కరీంనగర్‌లో జరిగే ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సౌందర్య.. ఆ హెలికాప్టర్‌లో మంటల్లో చిక్కుకోవడంతో సోదరుడు అమర్‌నాథ్‌తో పాటు సజీవ దహనమయ్యారు. దాంతో 'నర్తనశాల' ప్రాజెక్టు ఆగిపోయింది. ద్రౌపది పాత్రలో సౌందర్యను కాకుండా మరో నటిని చూడలేకపోయినందునే బాలకృష్ణ ఆ సినిమాను పునరుద్ధరించలేదు.
ఇన్నాళ్లకు ఆ సినిమా సన్నివేశాలను తిలకించే అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తున్నారు బాలకృష్ణ. "నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి 'నర్తనశాల'. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ 'నర్తనశాల' చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో 'నర్తనశాల' సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది." అని తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా ఆయన ప్రకటించారు. దాంతో పాటు 2004 మార్చి 1 నాటి ముహూర్తపు షాట్ పిక్చర్‌ను ఆయన షేర్ చేశారు.

![]() |
![]() |