![]() |
![]() |

"ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనే దానికీ, శ్రీనుగారూ మీ అమ్మమొగుడు బాగున్నాడా? అనే దానికీ చాలా తేడా ఉందిరా లమ్డీకొడకా" అని గర్జించాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ డైలాగ్ ఆయన నటిస్తోన్న 106వ సినిమాలోనిది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూవీగా ఇప్పటికే ఇది అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్య మునుపటి సినిమాల రిజల్ట్ ఎలాగైనా ఉండనీ.. బోయపాటి కాంబినేషన్‌లో ఆయన చేస్తున్న సినిమా అంటేనే దానికో స్పెషల్ క్రేజ్ వచ్చేస్తుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల్లో బాలకృష్ణను బోయపాటి చూపించిన తీరు అలాంటిది మరి.
ఇప్పుడు 'బీబీ3'గా.. అంటే బాలయ్య-బోయపాటి 3 పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సినిమాలోనూ బాలయ్య లుక్ అదిరిపోయేట్లు ఉందనేది ఏకగ్రీవంగా వినిపిస్తోన్న మాట. 'బీబీ3' నుంచి వస్తోన్న 'ఫస్ట్ రోర్' అన్నట్లుగానే బాలయ్య లుక్, ఆయన డైలాగ్, ఆయన యాక్షన్.. సింహాన్ని తలపిస్తున్నాయి. మోచేతి దాకా మడిచిన తెల్ల చొక్కా, తెల్ల పంచె ధరించిన బాలయ్య మెలితిప్పిన మీసకట్టుతో మధ్యవయసు మనిషి ఆహార్యంతో వహ్వా అనిపిస్తున్నారు.
.jpg)
తన దగ్గరకు వచ్చిన వ్యక్తి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి, ఆగ్రహోదగ్రుడై "లమ్డీకొడకా" అనే డైలాగ్ చెప్పేటప్పుడు బాలయ్య హావభావాలు, ఆయన కళ్లు పలికిస్తోన్న అభినయం చూసి తీరాల్సిందే. అది ఈనాటి హీరోల్లో బాలయ్యకే సాధ్యమైన నట విన్యాసం అనేది స్పష్టం. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఆయన యాక్షన్‌లోకి దిగిపోయారు. తనకు ఎదురొచ్చిన రౌడీ గ్యాంగ్‌ను ఉతికి ఆరేశారు. ఒక కాలును అరక యంత్రం మీద పెట్టి నిల్చొని వేలితో మీసం దువ్వి తన పౌరుషాన్నీ, మగసిరినీ ప్రదర్శించిన షాట్‌కు అదరహో అనాల్సిందే. బోయపాటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ ఎలాంటి టీజర్ ఆశిస్తున్నారో, అంతకు మించి సూపర్బ్ మాస్ లుక్‌లో బాలకృష్ణను ప్రెజెంట్ చేశాడు బోయపాటి. ఈ టీజర్ చూస్తుంటే తమకు గూస్‌బంప్స్ వస్తున్నాయని ఎన్‌బీకే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ టీజర్ ఇలా రావడంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజీయం, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా కారణమే.
ఈ టీజర్‌లో మిడిల్ ఏజ్‌లో ఉన్న బాలయ్య కనిపిస్తున్నాడు కాబట్టి, ఇంకో యంగ్ బాలకృష్ణ క్యారెక్టర్ కూడా ఉంటుందని ఊహించవచ్చు. 'సింహా', 'లెజెండ్' సినిమాల తరహాల్లోనే ఈ మూడో మూవీలోనూ బాలయ్యను డ్యూయల్ రోల్‌లో బోయపాటి ప్రెజెంట్ చేస్తున్నాడని వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా మలి దశ చిత్రీకరణకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత షూటింగ్ కొనసాగించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని బోయపాటి అండ్ టీమ్ భావించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బాలయ్య, బోయపాటి థర్డ్ వెంచర్ ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని వినికిడి.
తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య లక్కీ సీజన్ సంక్రాంతికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. అంతేకాదు.. బాలయ్య కెరీర్‌లోని ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటైన ‘సమరసింహారెడ్డి’ సినిమా విడుదల తేదీ అయిన జనవరి 13న ‘యన్.బి.కె.106’ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఏదేమైనా బాలయ్య-బోయపాటి థర్డ్ వెంచర్ హ్యాట్రిక్ పూర్తి చేస్తుందనే నిఖార్సైన నమ్మకాన్ని ఈ టీజర్ కలిగిస్తోందనేది నిజం. ఇక ఆ సినిమా ఆడియెన్స్ ముందుకు రావడమే ఆలస్యం.
![]() |
![]() |