![]() |
![]() |

మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వారిది హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటిది హఠాత్తుగా అనిల్‌తో కలిసి నటించకూడదని మాధరి డిసైడ్ చేసుకున్నారు. ఎందుకని? 90లలో వాళ్లు వరుసగా కలిసి నటిస్తుండటంతో సహజంగానే వారి మధ్య బంధం మరో స్థాయికి వెళ్లిందనే ప్రచారం మొదలైంది. పైగా ఆ టైమ్‌లో తమ సినిమా సెట్స్‌పై ఆ ఇద్దరూ గంటల కొద్దీ కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు. అయితే ఒకరోజు దానికి అడ్డుకట్ట పడింది.
ఒకసారి అనిల్, మాధురి సినిమా షూటింగ్‌లో ఉండగా, చెప్పాపెట్టకుండా ఆ సెట్స్‌కు అనిల్ భార్య సునీత తన పిల్లలతో కలిసి వచ్చారు. అప్పుడే అనిల్‌తో మాట్లాడి, అవతలకు వెళ్తూ ఉన్నారు మాధురి. తన భార్యాపిల్లలను చూసి వారి దగ్గరకు వెళ్లారు అనిల్. సునీతతో, పిల్లలతో మాట్లాడుతున్న అనిల్‌ను చూసిన మాధురి.. అప్పటికప్పుడు ఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అనిల్‌తో ఇక కలిసి నటించకూడదనీ, ఆయనకు దూరంగా మెలగాలనేది ఆ డెసిషన్. ఆ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ కుటుంబ సభ్యులకు హాని కలిగించే పని ఎప్పటికీ చేయనని మాధురి చెప్పడం గమనార్హం.
అనిల్‌తో అనేక హిట్ సినిమాల్లో నటించిన మాధురి ఆయనతో కలిసి నటించడం ఆపేయడానికి ఇదే కారణం. చాలా ఏళ్లు గడిచాక, 2019లో ఆ ఇద్దరూ 'టోటల్ ధమాల్' సినిమా కోసం మళ్లీ కలిశారు. ఆ మూవీలో అజయ్ దేవ్‌గణ్, రితీశ్ దేశ్‌ముఖ్, జావెద్ జాఫ్రీ, అర్షద్ వార్సి ఈషా గుప్తా ప్రధాన పాత్రధారులు. ఇంద్రకుమార్ డైరెక్ట్ చేసిన ఆ మూవీని దేవ్‌గణ్ ప్రొడ్యూస్ చేశాడు. 19 సంవత్సరాల సుదీర్ఘ విరామంతో మాధురి, అనిల్ ఆ సినిమాలో కలిసి నటించడం విశేషం. దానికి ముందు రాజ్‌కుమార్ సంతోషి సినిమా 'పుకార్' (2000)లో చివరిసారిగా వారు నటించారు.
ఆ సినిమా విడుదలకు ముందు 1999తో కాలిఫోర్నియాకు చెందిన ఎన్నారై శ్రీరామ్ మాధవ్ నేనేతో మాధురి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. అరిన్, ర్యాన్. 2002లో నటనకు తాత్కాలికంగా సెలవు ప్రకటించిన మాధురి తిరిగి 2007లో 'ఆజా నాచ్‌లే' మూవీతో రిఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మాధురి, అనిల్ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.
![]() |
![]() |