![]() |
![]() |

నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికీ!' మూవీకి ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వారి ప్రకారం జూన్ 10న విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.87 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. అతని మునుపటి పలు సినిమాలతో పోలిస్తే ఇవే తక్కువ ఓపెనింగ్స్ కావడం గమనార్హం. నాని కెరీర్‌లో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తొలి రోజు రూ. 7.57 కోట్ల షేర్ వసూలు చేసి, టాప్‌లో ఉండగా, కృష్ణార్జున యుద్ధం, జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు రూ. 4 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. అలాంటిది వాటన్నింటి కంటే తక్కువగా 'అంటే సుందరానికీ!' తక్కువ ఓపెనింగ్స్ రావడం ఈ సినిమా బిజినెస్‌తో సంబంధం ఉన్నవారందరినీ కలవరపరుస్తోంది.
ఆంధ్రలో రూ. 1.93 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ, రాయలసీమలో రూ. 38 లక్షలు, తెలంగాణలో రూ. 1.56 కోట్లను వసూలు చేసింది. తెలుగునాట ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 24 కోట్లు. అంటే ఫస్ట్ డే ఈ సినిమా 16 శాతం మాత్రమే రికవరీ సాధించింది. ఆంధ్రలో రూ. 10 కోట్ల బిజినెస్‌కు గాను 19.3 శాతం రికవర్ కాగా, రాయలసీమలో రూ. 4 కోట్లకు గాను 9.5 శాతం మాత్రమే రికవర్ అయ్యింది. ఇక తెలంగాణలో రూ. 10 కోట్ల విలువకు గాను రికవర్ అయ్యింది 15.6 శాతం. ఏ రకంగా చూసినా ఇవి అంచనాల కంటే చాలా తక్కువ ఓపెనింగ్స్.
మౌత్ టాక్ మిక్స్‌డ్‌గా ఉండటం, సినిమా లెంగ్త్ ఎక్కువై బోర్ కొడుతుందనే టాక్ ఎక్కువగా విస్తరించడం ఈ సినిమా కలెక్షన్లపై నెగటివ్ ప్రభావం చూపుతోంది. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా వివేక్ ఆత్రేయ డైరెక్టర్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
![]() |
![]() |