![]() |
![]() |

తమిళ సూపర్‌స్టార్ అజిత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'వాలిమై'. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొవిడ్ 19 వ్యాప్తి కారణంగా షూటింగ్, దాంతో పాటు విడుదల కూడా ఆలస్యమైంది. ఎనిమిది నెలల విరామంతో షూటింగ్‌ను టీమ్ పునరుద్ధరించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రస్తుతం దీని చిత్రీకరణ జరుగుతోంది. కాగా సెట్స్‌పై హీరో అజిత్ మరోసారి గాయపడటంతో షూటింగ్ నిలిపివేశారు. గాయాలు పూర్తిగా నయమయ్యాక షూటింగ్‌ను పునరుద్ధరించనున్నారు.
ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా అజిత్‌కు గాయాలయ్యాయని సమాచారం. అయితే అవి ఆందోళన చెందాల్సినంత పెద్దవి కావనీ, మైనర్ ఇంజ్యురీస్ అనీ యూనిట్ వర్గాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అజిత్ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. రెండు వారాల తర్వాత ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. సెట్స్‌పై ఆయన గాయపడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా ఓ బైక్ స్టంట్ చేసేటప్పుడు కిందపడటంతో చేతులు, కాళ్లు గీసుకుపోయాయి.
'వాలిమై' మూవీలో 'ఆర్ఎక్స్' 100 హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తుండటం గమనార్హం. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బోనీ కపూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్, హ్యుమా ఖురేషి హీరోయిన్ కాగా, యోగిబాబు కామెడీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
![]() |
![]() |