![]() |
![]() |

టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే ఎవరు? మనందరికీ తెలిసింది చిరంజీవి. చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఎవరు? ఆ విషయం ఇప్పట్లో తేలేది కాదు. ఇప్పటికైతే చిరంజీవే మెగాస్టార్. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఆ బిరుదును (సంబోధనను) మరో స్టార్ హీరోకు కట్టబెట్టింది. ఎవరికో తెలుసా? అల్లు అర్జున్‌కు. అవును. 'ఆహా' కోసం స్టార్ హీరోయిన్ సమంత 'సామ్ జామ్' అనే టాక్ షో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి వీక్షకుల నుంచి ఆదరణ బాగానే ఉంది. చిరంజీవితో సమంత చేసిన ఇంటర్వ్యూ ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇటీవల క్రిస్మస్ రోజున స్ట్రీమింగ్ అయ్యి, బ్రహ్మాండమైన వ్యూస్ సాధించింది.
ఈ షోలో అల్లు అర్జున్‌ను కూడా సమంత ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ జనవరి 1న రిలీజ్ అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈలోగా ప్రోమోస్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కాంట్రవర్సీ సృష్టించడమే కాకుండా, మెగాస్టార్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది. కారణం ఆ ప్రోమోలో అల్లు అర్జున్‌ను మెగాస్టార్‌గా సంబోధించడం. అవును. "మెగాస్టార్ అల్లు అర్జున్" అంటూ ఆ ప్రోమో రిలీజ్ చేయడంతో చిరంజీవి ఫ్యాన్స్ కోపంతో రగిలిపోగా, మిగతా వీక్షకులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు 'స్టైలిష్ స్టార్' అని. అలాంటిది ఆ పేరు తీసేసి మెగాస్టార్ అని సంబోధించడం చిరంజీవి ఫ్యాన్స్‌కు మింగుడుపడలేదు.
సోషల్ మీడియాలో చిరు ఫ్యాన్స్ దీనిపై ట్రోల్ చేస్తుండటంతో 'ఆహా' టీమ్ దృష్టికి ఇది వెళ్లింది. వెంటనే తప్పును సరిదిద్దుకుంటూ, తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మెగాస్టార్ ఫ్యాన్స్‌కు అపాలజీస్ చెప్పింది. ఆ మిస్టేక్ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తెలిపింది. "ఉన్నది ఒకే ఒక్క మెగాస్టార్.. ఆ సంగతి మనకు తెలుసు" అంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
'ఆహా' ప్లాట్‌ఫామ్‌కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. దాని మేనేజింగ్ పార్టనర్స్‌లో అల్లు అరవింద్ ఒకరు. బన్నీ కుమార్తె అర్హ పేరుమీద నెలకొల్పిన సంస్థ ద్వారా 'ఆహా' ఓటీటీని రన్ చేస్తున్నారు.

![]() |
![]() |