![]() |
![]() |

ఇటీవల డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన 'నాతిచరామి' మూవీలో ప్రభాకర్ క్యారెక్టర్లో చక్కని నటన ప్రదర్శించి, వీక్షకులను ఆకట్టుకున్నాడు అరవింద్ కృష్ణ. ఇట్స్ మై లవ్ స్టోరీ, రిషి, మన కుర్రాళ్లే, శుక్ర లాంటి సినిమాల్లో హీరోగా నటించిన అతను 'ప్రేమమ్'లో శ్రుతి హాసన్ భర్తగా, 'అన్నాత్తే' (పెద్దన్న)లో కీర్తి సురేశ్ జోడీగా కనిపించి మెప్పించాడు. ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా తన చేతి దాకా వచ్చిన కొన్ని ఆఫర్లు చేజారిపోయాయంటూ అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అతను చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'రిషి' సినిమాలు చేస్తున్న టైమ్‌లో కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయని అతను చెప్పాడు. "బానర్ల పేరు చెప్పను. ఆడిషన్ అయిపోయింది. దాదాపు సెలక్ట్ అయ్యాను. అగ్రిమెంట్ చేసుకోవడమే మిగిలుంది. డైరెక్టర్ నాకు కాల్ చేయట్లేదు. నేనే కాల్ చేసి, 'అగ్రిమెంట్ కోసం ఎప్పుడు రావాలి సార్?' అని అడిగాను. ఆయన చాలా బాధపడుతూ, 'లేదమ్మా.. నువ్వు ఈ సినిమాలో చేయట్లేదు' అన్నారు. 'ఏమైంది సార్?' అనడిగితే, 'నువ్వు ప్రొడ్యూసర్ కులం కాదని తీసేశారు' అని చెప్పారు. 'అది ముందే మీరు తెలుసుకొని ఉండాల్సింది కదా సార్' అనడిగాను. 'నాకు ఆ ఫీలింగ్ లేదు, ప్రొడ్యూసర్‌కు ఉంది' అని ఆయన సమాధానమిచ్చారు. ఇలా నాలుగైదు సార్లు నా విషయంలో జరిగింది" అని చెప్పుకొచ్చాడు అరవింద్ కృష్ణ.
అలాగే ఓ సందర్భంలో తనకు అవార్డ్ ఇస్తామని చెప్పి, పిలిపించి మరీ దాన్ని మరొకరికి ఇచ్చారని అతను వెల్లడించాడు. "ఒక అవార్డ్ ఫంక్షన్లో నాకు అవార్డ్ ఇవ్వాలి. అది రిసీవ్ చేసుకోవడానికే ఆ ఫంక్షన్‌కు వెళ్లాను. లేదంటే అంత దూరం ఎందుకు వెళ్తాను? కానీ ఆ అవార్డ్‌ను వేరే అతనికి ఇచ్చారు. ఇలాంటివి ఫేస్ చేశాను. యాక్టర్‌గా వచ్చి తప్పు చేశానా అని ఎన్నోసార్లు అనిపించింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు అరవింద్ కృష్ణ.
![]() |
![]() |