![]() |
![]() |

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర దారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25 న విడుదలై సంచలన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ తమ నటనతో కట్టిపడేశారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాలో మల్లి, లోకి పాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అసలు ఆ పాత్రల్లో నటించిన వారి పేర్లు ఏంటి? ఎక్కడ నుంచి వచ్చారు? 'ఆర్ఆర్ఆర్'లో అవకాశం ఎలా వచ్చింది? అంటూ చర్చలు మొదలయ్యాయి.

'ఆర్ఆర్ఆర్' సినిమా మల్లి కథతోనే ప్రారంభమవుతుంది. బ్రిటిష్ కోటలో బందీగా ఉన్న ఆ పాపని తీసుకురావడానికే భీమ్ ఢిల్లీకి వెళ్తాడు. మల్లి పాత్రలో నటించిన ఆ పాప అద్భుతంగా నటించింది. 'నన్ను ఈడ ఇడిసిపోకన్నా.. అమ్మ యాదికొస్తాంది' అంటూ కంటతడి పెట్టించింది. మల్లి పాత్రలో నటించి మెప్పించిన ఆ పాప పేరు ట్వింకిల్ శర్మ. సినిమాలో చాలా కీలకమైన ఈ పాత్ర కోసం రాజమౌళి దాదాపు 160 మందిని ఆడిషన్ చేయగా.. ఫైనల్ గా ట్వింకిల్ శర్మ సెలెక్ట్ అయింది. చండీఘర్ రాష్ట్రానికి చెందిన ఈ చిన్నారి 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' అనే షోతో పాటు పలు టీవీ షోలలో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ కమర్షియల్స్ లోనూ మెరిసింది. ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి ఆడిషన్ కి పిలిపించాడు. ఆడిషన్ చేశాక మల్లి పాత్రకు తనే తన పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించి తీసుకున్నాడు. నిజంగానే మల్లి పాత్రలో ట్వింకిల్ శర్మ జీవించింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ కి సెలెక్ట్ అయినప్పుడు ట్వింకిల్ శర్మ ఎనిమిదో తరగతి చదువుతుండగా.. సినిమా విడుదలయ్యే టైంకి ఆమె పదో తరగతికి వచ్చింది.

ఇక ఈ సినిమాలో మల్లి తల్లిగా లోకి పాత్రలో అద్భుతంగా నటించింది అహ్మరీన్ అంజుమ్. ఆమె కనిపించింది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తన నటనతో మెప్పించింది. కోల్‌కతాకు చెందిన అహ్మరీన్ అంజుమ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఈమెకు నటనలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్ అనే ఒక ఆన్‌లైన్ యాక్టింగ్ వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తోంది. ఈమె పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లు, యాడ్స్ లో నటించింది. ఆమె నటించిన 'జల్ దానవ్' అనే షార్ట్ ఫిల్మ్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైంది. ఇక 'సర్' మూవీలో ఆమె పోషించిన దేవిక పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే 'క్లాస్ ఆఫ్ 83' లోనూ నటించి మెప్పించింది. ఆమె నటనకు ఫిదా అయిన రాజమౌళి ఆమెకు లోకి అనే కీలక పాత్ర ఇచ్చాడు. మల్లి తల్లిగా ఆమె లోకి పాత్రలో జీవించి ప్రశంసలు అందుకుంటోంది.

'ఆర్ఆర్ఆర్' విజయం పట్ల అహ్మరీన్ అంజుమ్ చాలా సంతోషంగా ఉంది. మార్చి 27 న తన కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ లో సినిమా చూసిన ఆమె చాలా హ్యాపీగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పిన అహ్మరీన్ అంజుమ్.. తాజాగా 'లోకి & మల్లి' అంటూ ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ట్వింకిల్ శర్మతో దిగిన ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |