![]() |
![]() |

'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. తాజాగా విడుదలైన 'ప్యారడైజ్' గ్లింప్స్ కి మంచి స్పందన లభించింది. నాని నెవర్ బిఫోర్ లుక్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. 'ప్యారడైజ్'తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటి, టాప్ స్టార్స్ లీగ్ లోకి వెళ్ళాలని నాని ఆశపడుతున్నాడు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. నానికి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. (The Paradise)
ప్రస్తుతం ఇండియాలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 'డ్రాగన్' సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో.. ఈ సినిమా వాయిదా పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే 'డ్రాగన్' మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (NTR Dragon)
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. ఒకవేళ డ్రాగన్ నిజంగానే 2026 మార్చి 26 పై కన్నేస్తే మాత్రం.. నానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో 'డ్రాగన్'పై అంచనాలు ఆకాశాన్నంటుతాయి. దానికి పోటీగా తమ సినిమాని విడుదల చేసే సాహసం దాదాపు ఎవరూ చేయరు. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా సినిమా రిలీజ్ చేసినా.. థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం ఎదుర్కోక తప్పదు. ఈ లెక్కన మార్చి 26 కి డ్రాగన్ వస్తే.. ప్యారడైజ్ కి వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా నాని మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నాడు. ఇలాంటి టైంలో సోలో రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి డ్రాగన్ మార్చి 26 కి వచ్చి షాక్ ఇస్తుందో లేక ప్యారడైజ్ కి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |