![]() |
![]() |

వెబ్ సిరీస్ : సుడల్ 2
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, కథిర్, పార్తీబన్, లాల్, గౌరీ కిషన్, అశ్విని తదితరులు
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫీ: అబ్రహం జోసెఫ్
మ్యూజిక్: సామ్ సి.ఎస్
నిర్మాతలు: పుష్కర్, గాయత్రి
దర్శకత్వం: బ్రహ్మ.జి, సర్జున్
ఓటీటీ : ప్రైమ్ వీడియో
కథ:
షణ్ముగం(పార్తీబన్) పెద్ద కూతురు నందిని(ఐశ్వర్య రాజేశ్). నందిని చెల్లెలు నీల - పోలీస్ ఆఫీసర్ రెజీనా(శ్రియా రెడ్డి) కొడుకు అతిశయం ప్రేమించుకుంటారు. వాళ్లిద్దరూ చనిపోవడంతో, ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తారు. అయితే అది హత్య అని పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి (కథిర్) ద్వారా నందిని తెలుసుకుంటుంది. తన చెల్లెలు మరణానికి కారకులైనవారికి తగిన శిక్షను విధిస్తుంది. ఇక్కడి నుంచి సీజన్ 2 కథ మొదలవుతుంది. హత్య నేరంపై శిక్షను అనుభవించడానికి నందిని జైలుకి వస్తుంది. ఆమెను విడిపించడానికి లాయర్ చెల్లప్ప (లాల్) ప్రయత్నిస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి నందినిని ఇష్డపడుతుంటాడు. అదేసమయంలో ఒక రోజున లాయర్ చెల్లప్ప హత్యకి గురవుతాడు. సంఘటన స్థలంలో ఉన్న 'ముత్తు' (గౌరీ కిషన్)ను చక్రవర్తి అదుపులోకి తీసుకుంటాడు. ముత్తు గురించిన వివరాలు లభించకపోవడం .. చెల్లప్పను ఎందుకు హత్య చేసింది ఆమె చెప్పకపోవడంతో చక్రవర్తి తలపట్టుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎవరికివారుగా ఏడుగురు యువతులు పోలీస్ స్టేషన్ కి వచ్చి చెల్లప్పను తమే హత్య చేశానంటూ లొంగిపోతారు. దాంతో చక్రవర్తి అయోమయంలో పడతాడు. ఆ ఏడుగురిలో ఒకరికి ఒకరికి మధ్య లింక్ ఉండదు. వాళ్లకి 'ముత్తు' ఎవరనేది తెలియదు. నందిని శిక్షను అనుభవిస్తున్న సబ్ జైలుకు వాళ్లను తీసుకుని వెళతారు. అసలు జైల్లో ఏం జరుగుతుంది? చెల్లప్పను హత్య చేసింది ఎవరు? ఆ ఏడుగురికి ఆ హత్యకి మధ్య సంబంధమేమిటనేది మిగతా కథ.
విశ్లేషణ:
సుడల్ సీజన్ 1 చూసినవారు ఆల్రెడీ కథ అంతా అయిపోయింది కదా.. మళ్లీ ఏం చెబుతారనే అనుకుంటారు కానీ సీజన్ 1 వైపు నుంచి ఇందులో ఐశ్వర్య రాజేశ్ పాత్రతో మాత్రమే చిన్న లింక్ ఉంచారు అంతే. మిగతా కథ అంతా కూడా మరోవైపు నుండి సాగుతుంది. ఈ కథలో కూడా చాలా పాత్రలు .. అనూహ్యమైన మలుపులు ఉన్నాయి. సీజన్ 2 చూస్తే మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.
నందినీని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే లాయర్ చెల్లప్ప చనిపోతాడు. అతనిని ఎవరు చంపారు? ఇప్పుడు నందిని పరిస్థితి ఏమిటనే అంశాలపై దర్శకుడు ఆసక్తిని రేకెత్తించిన విధానం బాగుంది. ఆడియన్స్ గెస్ కి అందకుండా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఊళ్లో జరిగే అమ్మవారి ఊరేగింపు చివరి రోజుని, జైల్లో జరిగే ఫైట్ సీక్వెన్స్ ని లింక్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే చివరి ఎపిసోడ్ వరకు మెయిన్ విలన్ ఎవరో చెప్పకుండా ఒక్కో ఎపిసోడ్ ని దర్శకుడు తీర్చిదిద్దాడు.
ఈ సిరీస్ లో అడల్ట్ సీన్లు లేవు. అయితే కొన్ని చోట్ల రక్తపాతం ఉంటుంది. అది మినహాయిస్తే ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్ ని పంచుతుంది. మంజిమా మోహన్ ఎపిసోడ్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఐశ్వర్య రాజేశ్ పాత్ర డైనమిక్ గా ఉంటుందని భావించిన వారికి మాత్రం కాస్త నిరాశ కలుగుతుంది. అబ్రహం జోసెఫ్ ఫొటోగ్రఫీ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. జైలు .. సముద్రం .. యాక్షన్ సీన్స్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ గొప్పగా ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలలో నుంచి ఆడియన్స్ జారిపోకుండా చూస్తుంది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ ఫరవాలేదు. సాగదీసిన సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు:
చక్రవర్తిగా కథిర్, నందినిగా ఐశ్వర్య,చెల్లప్పగా లాల్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్
రేటింగ్: 3/5
✍️. దాసరి మల్లేష్
![]() |
![]() |