![]() |
![]() |

ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు మారుమోగిపోతుంది. అతను హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యువకుడితో కలిసి విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో వివాదానికి తెరదీసింది. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో ఫిమేల్ యాంకర్ తో విశ్వక్ సేన్ మాటల యుద్ధం మరింత వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన పవర్ ఫుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్.
'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని అల్లం అర్జున్ కుమార్ పాత్ర తన మనసుకి బాగా దగ్గరైందని అన్నాడు. అర్జున్ కుమార్ కూడా మనందరి లాగే భయం, అభద్రతా భావంతో ఉంటాడని తెలిపాడు. 25 ఏళ్లకు చదువు అయిపోయాలి, 30 ఏళ్ల లోపు సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలి.. ఇలాంటి లెక్కలేసుకొని బతుకుతున్నామని అన్నాడు. పక్కనోళ్ళతో పోల్చుకోవడం, పక్కనోళ్ళ కోసం బతకడం మానేసి.. మనసుకి నచ్చినట్లు బతకాలని, అదే ఈ సినిమాలో చూపించబోతున్నామని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
"నేను ఇప్పటిదాకా నా జర్నీ గురించి చెప్పలేదు. కానీ ఈ రోజు చెప్పాలి అనిపిస్తుంది. సినిమా హీరో అవుతానంటే ఏ ఫ్యామిలీలోనైనా షాక్ అవుతారు. కానీ మా అమ్మ నన్ను చాలా నమ్మింది. ఎంతో కష్టపడి యాక్టింగ్, డాన్స్ లు నేర్చుకొని.. సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగి.. 12 లక్షలు పెట్టి 'వెళ్ళిపోమాకే' అనే సినిమా చేశాం. దానిని ఒక ప్రొడ్యూసర్ తీసుకొని థియేటర్స్ రిలీజ్ చేయడం పెద్ద సక్సెస్ గా ఫీలయ్యాం. ఆ తర్వాత నాకు ఏ గుర్తింపు లేని టైంలో తరుణ్ భాస్కర్ నాతో 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చేశాడు. బిగ్ థాంక్స్ తరుణ్. దాని తర్వాత నేను 'ఫలక్‌నుమాదాస్' సినిమా చేశాను. దానికి మీడియా ఇచ్చిన సపోర్ట్, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోలేను." అన్నాడు.
"ఇలా సాగుతున్న నా కెరీర్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎదుగుదల అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడుతూ కూర్చోవడం కాదు.. ఆ సమస్యని పక్కని పెట్టి నవ్వుతూ ఉండగలగాలి. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను బాధపడను.. కానీ నాకు ఏదైనా జరుగుతుందేమో అని నా ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. ఈ సమయంలో నేను సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మా అమ్మ. 'అమ్మా నీ కొడుక్కి ఏం కాదు.. నన్ను ఎవరేం చేయలేరు'. నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వనని కొందరు అంటున్నారు. నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అలా నోరు మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయేవాడిని కాదు. అది మా అమ్మ నేర్పిన సంస్కారం. అవును నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ నాకు మద్దతుగా ఎందరో ఉన్నారు. ఇదే నేను సంపాదించుకున్న ఆస్తి. ఇదే నా ధైర్యం. ఈ టైంలో నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్." అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |