![]() |
![]() |

మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' నేడు(మే 12న) విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మహేష్ అభిమానులు మాత్రమే ఈ సినిమాని అంతో ఇంతో బాగుందని చెబుతున్నారు. ఆ లిస్టులో వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చేరిపోయాడు.
సర్కారు వారి పాట సినిమాను ట్విట్టర్ వేదికగా ఆకాశానికెత్తాడు విజయసాయి. "సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట' బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు." అంటూ ఆయన ట్వీట్ చేశాడు.

అయితే విజయసాయి ట్వీట్ పై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన మాటను మహేష్ చెబుతాడు. ఆ డైలాగ్ ఉంది కాబట్టే విజయసాయికి సినిమా నచ్చి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే "వైసీపీ ప్రభుత్వంలో సినిమా రివ్యూ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారా ఏంటి?" అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
![]() |
![]() |