![]() |
![]() |

సినిమాకు కథా కథనాలే బలం. వాటిలో బలం లేకపోతే ఎంతటి స్టార్లు ఉన్నా సినిమా నిలబడదు. సినిమాకి కథే గుండెకాయ లాంటిది. కానీ ఎందరో స్టార్లు ఈ విషయంపై దృష్టి పెట్టకుండా.. అనవసరపు ఆర్భాటాలకు పోయి చేదు ఫలితాలను చూస్తున్నారు.
ఇటీవల విడువులైన ఓ రెండు బడా సినిమాలు టాలీవుడ్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. అవే 'రాధేశ్యామ్' మరియు 'ఆచార్య'. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మార్చి 11 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. ఆకట్టుకోని కథా కథనాలతో నిరాశపరిచిన ఈ సినిమా.. బయ్యర్లకు దాదాపు 120 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ వర్గాల అంచనా.
అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ 'ఆచార్య' కూడా నిరాశపరిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదలైంది. బడా స్టార్లు కలిసి నటించిన సినిమా అయినప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. రెమ్యునరేషన్స్ కాకుండానే 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. పేలవమైన కథా కథనాలతో నిరాశపరిచింది. ఈ సినిమా కూడా బయ్యర్లకు దాదాపు 80 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని టాక్.
ఇక తాజాగా విడుదలైన 'సర్కారు వారి పాట' కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కూడా రెమ్యునరేషన్స్ కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు విడుదలైంది. కథా ఆలోచన బాగున్నప్పటికీ రొటీన్ సీన్స్, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చక్రంలో చిక్కుకొని అసలు కథ గాడి తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బడా ప్రొడక్షన్ హౌస్ లు, బడా స్టార్లు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. మా సినిమా అలా తీశాం, ఇలా తీశాం అంటూ అనవసరపు ఆర్భాటాలకు పోతున్నారు కానీ కథా కథనాలపై ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదు. అదే కొంప ముంచుతుంది. తమ సినిమాకి అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అయిందని గొప్పలు చెప్పుకునే ముందు.. కాస్తయినా స్క్రిప్ట్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. అసలు స్క్రిప్ట్ లోనే దమ్ము లేకపోతే పైపైన ఎన్ని మెరుగులు దిద్దినా అది ప్రేక్షకులను మెప్పించలేదన్న విషయాన్ని ఇకనైనా గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |