![]() |
![]() |

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఏ ముహూర్తాన రూ.200 కోట్లు కొడతాను అన్నాడో కానీ.. అప్పటి నుంచి అతనిపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి విజయవంతమైన చిత్రాలతో.. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. అయితే ఎంత తొందరగా ఎదిగాడో.. అంతే తొందరగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. 'గీత గోవిందం' తర్వాత గత ఆరేళ్లుగా విజయ్ కి భారీ విజయం దక్కలేదు. మధ్యలో 'టాక్సీవాలా' మాత్రమే హిట్ అనిపించుకోగా.. 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాలతో ఫ్లాప్ లని మాత్రమే ఎదుర్కోగా.. ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'తో ఘోర పరాజయంతో పాటు ట్రోల్స్ ని కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ ట్రోల్స్ డోస్ మరింత పెరిగింది.
సినిమా ప్రమోషన్స్ సమయంలో విజయ్ మాట్లాడే మాటలు వివాదాస్పదమవుతుంటాయి. 'అర్జున్ రెడ్డి' సమయంలోనే విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. అయితే ఆ సినిమా సాధించిన భారీ సక్సెస్ తో అవన్నీ కొట్టుకుపోయాయి. పైగా అది తన ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ అంటూ అప్పుడు విజయ్ ని అందరూ వెనకేసుకొచ్చారు. కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్ లు ఎదురవుతుండటంతో.. ఓవర్ కాన్ఫిడెన్స్, నోటి దురుసు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
2022 లో వచ్చిన 'లైగర్'పై విజయ్ అప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేస్తానని, వసూళ్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని చెప్పాడు. తీరా విడుదలయ్యాక డిజాస్టర్ టాక్ తో.. కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేక 60 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. దీంతో సినిమా కంటెంట్ మీద దృష్టి మీద పెట్టకుండా.. ఇలా ప్రమోషన్స్ లో ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడితే ఏమొస్తుంది? అంటూ అప్పుడే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత 'ఖుషి' అనే లవ్ స్టోరీ చేశాడు. సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి, సినిమాకి మంచి టాకే వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం 80 కోట్లే వచ్చాయి. దాని కారణం ప్రస్తుతం ప్రేక్షకులు విభిన్న సినిమా చూడాలని కోరుకుంటుంటే.. విజయ్ మాత్రం రెగ్యులర్ లవ్ స్టోరీ చేయడమే.
ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్'(Family Star)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా 200 కోట్ల ప్రస్తావన తీసుకొచ్చాడు. "నేను 200 కోట్లు కొడతానంటే ఓవర్ కాన్ఫిడెన్స్, బలుపు అన్నారు. కానీ ఇది నా కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా 200 కోట్లు కొడతాను." అని విజయ్ అన్నాడు. కానీ ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. 200 కోట్ల కల అసలు ఇప్పట్లో నెరవేరుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 'లైగర్' ఎలా డిజప్పాయింట్ చేసిందో.. 'ఫ్యామిలీ స్టార్'కి కూడా అలాంటి టాక్ వస్తోంది. అసలు ఇందులో ఏముందని విజయ్ ఈ సినిమా ఓకే చేశాడని విమర్శలు వస్తున్నాయి. "200 కోట్లు కొడతాను" అని మాటల్లో చెప్పక్కర్లేదు.. సినిమాలో విషయముంటే కలెక్షన్లు అవే వస్తాయి. ఏ స్టార్ ఉన్నాడని 'హనుమాన్' 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఏ స్టార్ ఉన్నాడని 'మంజుమ్మల్ బాయ్స్' 200 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలకు ముందు "200 కోట్లు కొడతాం" అని చెబితే వార్తల్లో నిలుస్తామేమో కానీ వసూళ్లు రావు. సినిమాలో విషయముంటే వసూళ్లు వాటంతటవే వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించకుండా.. కథల ఎంపికలో శ్రద్ధ తీసుకోకుండా.. ఇలాగే మూస కథలు చేసుకుంటూ పోతే 200 కోట్లు కొట్టాలనే విజయ్ కల ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
![]() |
![]() |