![]() |
![]() |

మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలనే పట్టుదలతో సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నాగశౌర్య చేసిన సినిమా 'అశ్వత్థామ'. రిలీజైనప్పుడు ఈ మూవీకి మంచి టాకే వచ్చింది. కానీ, మనవాడికి మాస్ ఇమేజ్ లేకపోవడంతో చివరకు ఆశించిన రీతిలో వసూళ్లు తేలేకపోయింది. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్‌పై చేసే ఆలోచనకు విరామమిచ్చి, బయటి నిర్మాతల సినిమాలకు వరుసగా ఓకే చేసుకుంటూ వెళ్లాడు శౌర్య. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య రూపొందిస్తున్న చిత్రం, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం అతడి ఖాతాలో ఉన్నాయి.
ఇవి కాకుండా గతంలో తనకు 'ఊహలు గుసగుసలాడే' మూవీతో కెరీర్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమాని చాలా రోజుల క్రితమే మొదలుపెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అమెరికా కావడం ఇప్పుడు మనవాడికి సినిమా కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదు. ఎక్కువ భాగం యు.ఎస్.లోనే తీయాల్సి ఉంది. ఇండియాలో లాక్‌డౌన్ తీసేసినా, సమీప భవిష్యత్తులో అమెరికా వెళ్లి షూటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిసిందే. కరోనాతో ఆ దేశం అల్లాడిపోతోంది.
దాంతో ఇండియాలోనే షూటింగ్ చేయాలని డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్‌కు నిర్మాతలు సూచిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అలా చేయాలంటే కథంతా మార్చాలని అవసరాల అంటున్నాడంట. అలా చేస్తే, ఇప్పటిదాకా తీసిన సీన్లన్నీ వృథా అయినట్లే అంటున్నారు. చివరకు ఈ సినిమా విషయంలో ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాల్సిందే.
![]() |
![]() |