![]() |
![]() |

ఈ తరం అగ్ర కథానాయకుల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జోషే వేరు. కథానాయకుడిగా పరిచయమైన సంవత్సరం (2001)లోనే ముచ్చటగా మూడు సినిమాల (‘నిన్ను చూడాలని’, ‘స్టూడెంట్ నెం.1’, ‘సుబ్బు’) తో పలకరించి తన దూకుడేంటో చెప్పకనే చెప్పాడు తారక్. తదనంతరకాలంలోనూ ఏడాదికి రెండేసి సినిమాలతో పలకరించి అలరించాడు ఈ ‘అరవింద సమేత’ స్టార్. అప్పుడప్పుడు ఏడాదికో చిత్రంతో సరిపెట్టినా.. ఈ జనరేషన్ స్టార్ హీరోలలో ‘పాతిక చిత్రాల మైలురాయి’కి అనతికాలంలోనే చేరువయ్యాడు తారక్.
ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ.. తారక్ ఖాతాలో అడపాదడపా ‘జీరో రిలీజెస్ ఇయర్స్’కి స్థానం దక్కుతోంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 2009ని ఇలాగే ‘శూన్య చిత్ర సంవత్సరం’గా సరిపెట్టిన ఈ నందమూరి థర్డ్ జనరేషన్ స్టార్.. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ (‘రౌద్రం రణం రుధిరం’) కారణంగా 2019, 2020 సంవత్సరాలని అదే జాబితాలో చేర్చాడు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తారక్ తొలిసారి గ్యాప్ తీసుకున్న తరువాత వచ్చిన ‘అదుర్స్’ చిత్రం ఎలాగైతే సంక్రాంతి సీజన్‌లో సందడి చేసిందో, అలాగే మలిసారి తీసుకున్న గ్యాప్ అనంతరం వస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా ముగ్గుల పండగనే లక్ష్యం చేసుకుంది. మరి.. గ్యాప్ తరువాత వచ్చిన ‘అదుర్స్’ 2010 సంక్రాంతి విజేతగా నిలిచినట్టే.. ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా 2021 పొంగల్ విన్నర్ అవుతుందేమో చూడాలి.
కొసమెరుపేమిటంటే.. ఫస్ట్ టైమ్ గ్యాప్ తరువాత వచ్చిన ‘అదుర్స్’ని తారక్ లక్కీ డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందిస్తే.. సెకండ్ టైమ్ గ్యాప్ తరువాత వస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ని మరో లక్కీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అటు వినయ్, ఇటు జక్కన్న.. ఇద్దరు కూడా తారక్ సినిమాలతోనే దర్శకులుగా తొలి అడుగేయడం విశేషం.
![]() |
![]() |