![]() |
![]() |

తండ్రుల బాటలోనే తనయులు కూడా పయనించడం సర్వ సాధారణ విషయమే. సర్వత్రా ఆదరణీయ అంశమే. వీటిలో చాలామటుకు ప్రయత్నపూర్వకంగా జరిగితే.. కొన్ని మాత్రం యాదృచ్ఛికంగా చోటుచేసుకుంటుంటాయి. ఇక మెగా కాంపౌండ్ తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇది మినహాయింపు కాదనే చెప్పాలి. హావభావాల విషయంలోనూ, పాత్రల ఎంపికలోనూ తండ్రి చిరు మార్గంలోనే వెళ్ళడం తనయుడు చరణ్ చిత్రప్రయాణంలో పరిపాటైంది.
చిరు తరహాలోనే మాస్ రోల్స్ కే ఓటేసే చరణ్.. నాన్నలాగే అప్పుడప్పుడు ప్రయోగాలకీ పట్టం కట్టాడు. విజయాలూ పట్టాడు. కట్ చేస్తే.. తాజాగా మరో విషయంలోనూ చిరు తరహాలోనే ముందుకు సాగుతున్నాడు చరణ్. ఇంతకీ అదేమిటంటే.. చిరు ఎలాగైతే ఈ మధ్య వరుసగా ఒకే బేనర్ లో మూడు చిత్రాలు చేస్తున్నారో.. అదే శైలిలో చరణ్ కూడా ఒకే సంస్థలో మూడు చిత్రాలు చేయబోతున్నాడని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. 'ఖైదీ నంబర్ 150'తో రీ-ఎంట్రీ బాట పట్టిన చిరు.. ఆ చిత్రాన్ని తమ హోమ్ బేనర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో చేశారు. తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా.. చిరు బాక్సాఫీస్ స్టామినాని మరోమారు తెలియజేసింది. తనకి గ్రాండ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అయింది. ఆపై తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'ని కూడా ఇదే సంస్థలో చేశారు చిరు. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'ఆచార్య' కూడా సేమ్ బేనర్ లోనే నిర్మాణం జరుపుకుంటోంది. సో.. చిరు కథానాయకుడిగా మూడు వరుస చిత్రాలు ఒకే సంస్థలో నిర్మితమవుతున్నాయన్నమాట.
చిరు విషయం ఇలా ఉంటే.. చరణ్ కూడా డిటో ఫీట్ రిపీట్ చేస్తున్నాడని టాక్. గత చిత్రం 'వినయ విధేయ రామ'ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ లో చేసిన చరణ్.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఆర్ ఆర్ ఆర్'ని కూడా అదే సంస్థలో చేస్తున్నాడు. అంతేకాదు.. తన హీరోగా నటించబోతున్న నెక్స్ట్ వెంచర్ కూడా డీవీవీ కంపెనీలోనే ఉంటుందని ప్రముఖంగా వినిపిస్తోంది. మొత్తమ్మీద చిరు ఎలాగైతే ఒకే సంస్థలో మూడు వరుస చిత్రాలు చేస్తున్నారో.. ఆ చిత్రాల నిర్మాత అయిన చరణ్ కూడా అదే బాటలో వెళుతున్నాడన్నమాట!!
![]() |
![]() |