![]() |
![]() |

రంగుల ప్రపంచం చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొందరు సినీ పరిశ్రమలో ఏళ్ళ తరబడి ప్రయత్నించినా సరైన బ్రేక్ రాదు. మరికొందరు మాత్రం ఒకట్రెండు సినిమాలకే స్టార్డమ్ చూస్తారు.. కానీ, ఆ తర్వాత సినిమాలు చేయకుండా మాయమైపోతారు. 'గీతాంజలి' హీరోయిన్ గిరిజా షెట్టర్ కూడా ఆ కోవకే చెందుతారు. అప్పట్లో 'గీతాంజలి'తో సంచలనం సృష్టించిన గిరిజ గురించి.. ఏకంగా 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ మాట్లాడుకుంటున్నారు.
నాగార్జున, మణిరత్నం కాంబినేషన్ లో 1989లో వచ్చిన 'గీతాంజలి' ఆల్ టైం క్లాసిక్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యారు గిరిజ. మొదటి సినిమాతోనే ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగులో గిరిజ తిరుగులేని స్టార్ హీరోయిన్ అవుతారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. 'గీతాంజలి' తర్వాత 'హృదయాంజలి' అనే ఒకే ఒక్క తెలుగు సినిమా చేశారు గిరిజ. అయితే ఆ సినిమా 1992లో పూర్తయితే.. ఏకంగా పదేళ్ల తర్వాత 2002లో విడుదలైంది. అప్పటికే గిరిజ సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కొన్నేళ్లుగా ఆమె లండన్ లోనే ఉంటున్నారు. అక్కడ రైటర్ గా, జర్నలిస్ట్ గా, ఫిలాసఫర్ గా రాణిస్తున్నారు. అలాంటి గిరిజ తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. దానికి కారణం నాగార్జున కావడం విశేషం.
జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగార్జున. ముఖ్యంగా 'గీతాంజలి' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పారు. మణిరత్నంతో సినిమా చేయాలని, ఆయన వెంట నెలరోజులు తిరిగి 'గీతాంజలి' చేశానని నాగార్జున తెలిపారు.
'గీతాంజలి' గురించి నాగార్జున మాట్లాడిన సమయంలో.. హోస్ట్ జగపతి బాబు ఒక సర్ప్రైజ్ అంటూ గిరిజ వీడియో బైట్ ప్లే చేశారు. "నా తొలి సినిమాకు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆయనకు దయాగుణం ఉంది. చాలా సౌమ్యుడు. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున నన్ను కంగ్రాచ్యులేట్ చేశారు. ఆ సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. ఇంతమంచి కో-యాక్టర్ గా ఉన్నందుకు థాంక్యూ నాగార్జున. నువ్వు ఒక లెజెండ్ కన్నా తక్కువ కాదు." అంటూ గిరిజ మాట్లాడారు. గిరిజ మాటలకు నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ చెప్పారు. 'గీతాంజలి' రోజులను గుర్తు చేసుకుంటూ నాగార్జున గురించి గిరిజ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గిరిజ తండ్రిది భారత్ కాగా, తల్లిది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లోనే పుట్టి పెరిగినప్పటికీ గిరిజకు భారతదేశముపై మమకారము ఎక్కువ. శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న 56 ఏళ్ళ గిరిజ.. గతేడాది 'ఇబ్బని తబ్బిడ ఇలియాలి' అనే కన్నడ సినిమాలో నటించారు. మరి భవిష్యత్ లో తెలుగు సినిమాల్లోనూ కనిపించి సర్ ప్రైజ్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |