![]() |
![]() |

ఒక హీరోకి అనుకున్న కథని మరో హీరో చేయడం సహజం. అలా చేసి హిట్ కొట్టిన హీరోలు ఉన్నారు.. ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాగే ఎప్పుడో మహేష్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ అనుకున్న కథ.. తిరిగి తిరిగి ఇప్పుడు ఓ కుర్ర పాన్ ఇండియా హీరో దగ్గరకు చేరిందని తెలుస్తోంది.
చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ కి తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, రెండో సినిమా 'బిజినెస్ మేన్' ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మూడో సినిమా కూడా ఎప్పుడో రావాల్సి ఉండగా.. ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'ను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. మహేష్ కూడా మొదట ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఎందుకనో ఆ తర్వాత 'జనగణమన'కు జై కొట్టలేదు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' చేయడానికి మహేష్ ముందుకు రాకపోవడంతో.. కొనేళ్లు దానిని పక్కన పెట్టి, ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు పూరి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో 'లైగర్' చేస్తున్న సమయంలో.. మళ్ళీ 'జనగణమన' తెరపైకి వచ్చింది. 'లైగర్' విడుదల కాకముందే.. విజయ్ తో 'జనగణమన'ను అనౌన్స్ చేశాడు పూరి. అయితే 'లైగర్' డిజాస్టర్ కావడంతో.. విజయ్ కూడా 'జనగణమన' చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ కి.. మరో కొత్త హీరో దొరికినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్న పూరి.. తన తదుపరి సినిమాని తేజ సజ్జా (Teja Sajja)తో చేయనున్నట్లు సమాచారం. 'హనుమాన్'తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజకి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. పలువురు దర్శకనిర్మాతలు తేజతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పూరి దృష్టి తేజపై పడినట్లు తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'ని తేజతో చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని.. తేజ సైతం పూరితో సినిమా చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వినికిడి.
జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పూరి. పైగా హీరోలను ఆయన ప్రజెంట్ తీరుకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.
![]() |
![]() |