![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అనిరుధ్ (Anirudh) కాంబినేషన్ అంటే.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ఏమో మ్యాన్ ఆఫ్ మాసెస్.. అనిరుధ్ ఏమో తన మ్యూజిక్ తో మాస్ ని ఉర్రూతలూగిస్తాడు. అందుకే ఈ ఇద్దరు కలయికలో 'దేవర' (Devara) సినిమా వస్తుందని తెలియగానే.. సాంగ్స్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దేవర సాంగ్స్ ఎప్పుడెప్పుడు వినాలా అని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఎదురుచూపులు ఫలించి.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొదటి సాంగ్ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సాంగ్ పై అంచనాలు మామూలుగా లేవు. దానికి తోడు ఈ సాంగ్.. "జైలర్ సినిమాలోని హుకుం సాంగ్ ని మించి ఉంటుంది" అని నిర్మాత నాగవంశీ వంటి వారు చెప్పడంతో.. అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. తీరా సాంగ్ విడుదలయ్యాక.. ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'దేవర' ఫస్ట్ సింగిల్ గా 'ఫియర్ సాంగ్' (Fear Song) విడుదలైంది. ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో చెప్పుకోదగ్గ వ్యూసే వచ్చాయి కానీ.. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ హైప్ కి తగ్గ రికార్డు వ్యూస్ అయితే రాలేదనే చెప్పాలి. దానికి కారణం ఈ సాంగ్ కి మిశ్రమ స్పందన రావడమే. సాంగ్ వినడానికి బాగానే ఉన్నా.. పాడుకోవడానికి మాత్రం కష్టంగా ఉంది. ముఖ్యంగా లిరిక్స్ ని మ్యూజిక్ బాగా డామినేట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ్యూజిక్ కూడా 'విక్రమ్', 'జైలర్', 'లియో' వంటి సినిమాలను గుర్తు చేస్తుందని.. ఏమాత్రం కొత్తదనం లేదని అంటున్నారు. హుకుం సాంగ్ ని మించి కాదు కదా.. దాని దరిదాపుల్లో కూడా లేదని... అనవసరంగా ఎక్కువ పబ్లిసిటీ చేశారని కొందరు ట్రోల్ చేస్తున్నారు.
దేవర మొదటి సాంగ్ ని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనిరుధ్ మాస్ సాంగ్స్ ఇన్స్టంట్ గా హిట్ కావని.. స్లో పాయిజన్ లా ఎక్కి చార్ట్ బస్టర్స్ అవుతాయని చెబుతున్నారు. 'వాతి కమింగ్', 'హుకుం' వంటి పాటలకు కూడా విడుదల కాగానే రికార్డు వ్యూస్ రాలేదని.. వింటున్న కొద్దీ సాంగ్స్ అందరికీ నచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. అలాగే 'ఫియర్ సాంగ్' కూడా వింటున్న కొద్దీ బాగా నచ్చుతుందని, థియేటర్లలో ఈ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు.. 'ఫియర్ సాంగ్' కూడా 'వాతి కమింగ్', 'హుకుం' సాంగ్స్ లా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |