![]() |
![]() |
.webp)
ఇటీవల జరిగిన ‘రజాకార్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజకీయ రంగు పులుముకుంది. రజాకార్ల అరాచకాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గత చరిత్రను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఫంక్షన్‌కి విచ్చేసిన ప్రముఖులు. ఆ క్రమంలో ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడిన మాటల్లో రజాకార్ల చరిత్ర, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు, రజాకార్లకు వ్యతిరేకంగా మొదట గళమెత్తింది ఒక ముస్లిం వ్యక్తేనని గుర్తు చేశారు. షోయబుల్లాఖాన్, ముగ్ధుం మొయినుద్దీన్ లాంటి వారు సైతం నిజాం ప్రభుత్వంతో పోరాటంలో ముందుండి నడిచారని పేర్కొన్నారు. రజాకార్లు చేసిన అరాచకాలు.. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి లాంటి నేతల నేతృత్వంలో జరిగిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఎవరికీ తలవంచని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించారని తెలిపారు. గుజారాత్‌లోని జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలను భారత్‌లో కలిపి ఉండక పోతే నేడు ప్రజాస్వామం ఉండేది కాదని ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ సోదరుల్లా మెలగాలని అన్నారు. ఇతరులకు మంచినే చెయ్యాలని ప్రతి మతం చెబుతుంది. ఇకపోతే రాముడు ఎవరి అబ్బ సొత్తు కాదు, అది అందరికీ సంబంధించింది. ఏ ఒక్కరో దాన్ని ఆపాదించుకోవడం సరికాదు అన్నారు.
అంతకుముందు బిజెపి ఎమ్మెల్యే పైడి ఆకాష్‌రెడ్డి రజాకార్ల వ్యవస్థ గురించి మతాల గురించి పలు అంశాలను ప్రస్తావించారు. రజాకార్ సినిమాను రూపొందించిన సినిమా యూనిట్‌లోని అందరి పాదాలు కడిగి నెత్తినపోసుకుంటానని అన్నారు. అంతేకాదు, ఇండియాలో ఉన్న ముస్లింలుగానీ, క్రిస్టియన్లుగానీ విదేశీయులు కాదని, ఇక్కడ ఉన్న వారందరి డిఎన్‌ఎ ఒకటేనని అన్నారు. ఇది అమెరికాలో చేసిన పరిశోధనలో తేలిందని తెలిపారు. మిగతా మతస్తులకు కూడా ఒకటే చెబుతున్నామని, మీరు బ్రతకండి మమ్మల్నీ బ్రతకనీయండి అంటూ ఆవేశంగా మాట్లాడారు. దానికి ఆర్.నారాయణమూర్తి పైవిధంగా స్పందించారు.
![]() |
![]() |