![]() |
![]() |

బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత పూజా హెగ్డేకి సరిగ్గా సరిపోతుంది. 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైన పూజ.. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ చైర్ పూజ దే అనుకుంటున్న సమయంలో.. వరుస పరాజయాలు పలకరించడంతో ఒక్కసారిగా వెనుకబడిపోయింది. ఏవో కారణాల వల్ల 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బడా సినిమాలు చేజారిపోయాయి. మరోవైపు బాలీవుడ్ కూడా అంతగా కలిసి రావడంలేదు. దీంతో మొన్నటిదాకా బుట్టబొమ్మగా ఒక వెలుగు వెలిగిన పూజ కెరీర్.. ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. అయితే ఇక పూజ పనైపోయింది అనుకుంటున్న సమయంలో.. ఆమెకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' మూవీ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ప్రకటించనున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు టాక్. బన్నీ-అట్లీ కాంబినేషన్ అంటే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే తెలుగుతో పాటు హిందీలోనూ గుర్తింపు ఉన్న పూజను హీరోయిన్ గా ఎంపిక చేశారని వినికిడి. అదే నిజమైతే పూజ జాక్ పాట్ కొట్టినట్లే.
గతంలో 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో బన్నీ, పూజ స్క్రీన్ చేసుకున్నారు. ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే.. వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. ఈ సినిమా విజయం పూజకి చాలా కీలకం. మరి ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి.. పూజ మునుపటి వైభవాన్ని చూస్తుందేమో చూడాలి.
![]() |
![]() |