![]() |
![]() |

వెబ్ సిరీస్: పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్
నటీనటులు: నిఖిలా విమల్, సన్నీ వెయిన్, విజయరాఘవన్, అశోకన్ , అజు వర్గీస్
రచన : దీపు ప్రదీప్
ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్
సినిమాటోగ్రఫీ: అనూప్ వి శైలజ
సంగీతం: మజీబ్ మజీద్
నిర్మాతలు : ముఖేష్ ఆర్ మెహతా, సివి సారథి
దర్శకత్వం: ప్రవీణ్ చంద్రన్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మలయాళంలో తెరకెక్కిన కొన్ని వెబ్ సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతున్నాయి. అలాంటిదే నిఖిలా విమల్, సన్నీ వెయిన్, విజయరాఘవన్ నటించిన ' పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ ' వెబ్ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ :
కేరళలోని పెరిల్లూర్ అనే ఊరిలో పంచాయతీ ప్రెసిడెంట్ కోసం ఎన్నికలు సమీపిస్తుంటాయి. అప్పటికే ముందునుండి కొనసాగుతున్న పంచాయితీ ప్రెసిడెంట్ పీతాంబరాన్ని ఓడించడానికి ఓ కొత్త అపోజిషన్ వస్తుంది. అయితే పీతాంబరం మీద కోర్టులో అప్పటికే ఓ కేస్ నమోదవుతుంది. దాంతో అతని స్థానంలో ఎవరిని నిల్చోబెట్టాలా అని ఆలొచిస్తూ తన కుటుంబంలోని వారందరిని అడుగుతాడు. ఇక ఎవరు ముందుకురావడంతో తన చెల్లెలి కూతురు అయిన మాళవికని కలిసి ఈ ప్రెసిడెంట్ పదవి అనేది తన పరువు, మర్యాదలకి సంబంధించినిదని కన్విన్స్ చేస్తాడు. దాంతో మాళవిక వాళ్ళ అమ్మ బలవంతం మీద మాళవిక సరేనంటుంది. అయితే మాళవిక తన చిన్నతనం నుండి శ్రీకుంటన్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. అదే సమయంలో శ్రీకుంటన్ కి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తారు. మొదటగా మాళవికని చూసిన శ్రీకుంటన్ పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని చూసి తనని ఇష్టపడి మాళవికని వద్దని వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడు. అయితే పెరిల్లూర్ గ్రామ ప్రెసిడెంట్ గా మాళవిక గెలిచిందా? శ్రీకుంటన్ ప్రేమని దక్కించుకుందా లేదా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
పెరిల్లూర్ అనే గ్రామంలోని ప్రజలు ఎలా ఉంటారు. అక్కడ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒక్కో మనిషి స్వభావం ఎలాంటిదనే కథని ఎంచుకొని దాన్ని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ ప్రవీణ్ చంద్రన్ అంతగా సక్సెస్ కాలేకపోయాడు. మొదటగా బాల్యంలో మాళవిక ప్రేమించిన శ్రీకుంటన్ ని చూపించిన తీరు బాగుంది. అదే లవ్ ట్రాక్ ని అలాగే కొనసాగిస్తే బాగుండేది. మధ్యలో రాజకీయ పరిస్థితులను ఇన్వాల్వ్ చేయడంతో కథ గజిబిజిగా మారింది. ఓ ఊరిలో ప్రజలు ఎలా ఉంటారో చూపించడానికి చక్కని కథ రాసిన దీపు చంద్రన్.. ఒక్క ట్విస్ట్ కూడా లేకుండా భలే రాసాడు.
కథనంలో వేగం లేదు. ప్రతీ ఎపిసోడ్ నిడివి ముప్పై నిమిషాల పైనే ఉంది. ఇక చివరి ఎపిసోడ్ లోనైనా కథ ఇంట్రెస్ట్ గా ఉంటుందంటే అదీ ఉండదు. ఏదో సప్పగా సాగుతుంది. సిరీస్ మొత్తం ఇంటెన్స్ లేకుండా... ఏదో పోతుందా అంటే పోతుందా అన్నట్టు పోతుంది. ఇక దీనికి ప్రీమియర్ లీగ్ అని ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కాదు. హీరో పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం, భారీ డైలాగ్స్ ఎలాగు లేవు.. కనీసం ఈ ఒక్క సీన్ కోసమైన ఈ సిరీస్ చూడాలంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
మొదటి ఎపిసోడ్ లో క్యారెక్టర్ లు అన్నీ పరిచయం చేశాడు కదా ఇక రెండవ ఎపిసోడ్ లో అయినా మెయిన్ కథని చూపిస్తాడేమో అంటే మొదటి ఎపిసోడ్ లో సీన్లనే ప్రతీ ఎపిసోడ్ లో చూస్తున్న ఫీల్ కన్పిస్తుంది. ఇక ఓ నాలుగు ఎపిసోడ్ లు చూసాక ఇంకేముందనే భావన అప్పటికే ప్రేక్షకుడికి వచ్చేస్తుంది. ఈ సిరీస్ కి పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ అని ఎందుకు పెట్టారంటే.. ఈ ఊరి గురించి తెలుసుకోడానికి ఈ సిరీస్ చూసే ప్రేక్షకులంతా ప్లేయర్స్ అన్నట్టుగా ఏడు ఎపిసోడ్ లలో ఎవరికి వాళ్ళే మీకు నచ్చింది వెతుక్కోండి అన్నట్టుగా ప్రేక్షకులకి వదిలేసారు. పోనీ చివరి ఎపిసోడ్ అయిన బాగుందా అంటే అవే సీన్లు.. పెద్దగా మార్పు ఉండదు. కామెడీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానంగా చూపించాల్సిన కథ మిస్ అయింది. చాలా సులభమైన పగలు, ప్రశాంతమైన రాత్రులు ఇకపై నాకు దొరకవు లాంటి కొన్ని డైలాగులు మెప్పించాయి. జీవితంలో సాగే ప్రతీది మన ఊరుతోనే మొదలవుతుంది. పెరిల్లూర్ అనే ఊర్లో ప్రజలు సమస్యనా లేక పెరిల్లూర్ అనే ఊరే సమస్యా అనే క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.
భవన్ శ్రీకుమార్ ఎడిటింగ్ మామూలుగా ఉంది. అనూప్ వి శైలజ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మజీబ్ మజీద్ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నిఖిలా విమల్ అందంతో ఆకట్టుకుంది. సన్నీ పెయిన్ నటన బాగుంది. విజయ రాఘవన్ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
పెరిల్లూర్ ఊరి ప్రజల జీవనజైలిని చూడాలనుకుంటే ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 2 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |