![]() |
![]() |

సంక్రాంతి సినిమాల విషయంలో చిక్కుముడి వీడింది అనుకుంటే.. మరో కొత్త లొల్లి షురూ అయింది. ఈ సంక్రాంతి బరిలో దిగడానికి 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'ఈగల్', 'నా సామి రంగ' సిద్ధమయ్యాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్యతో పాటు, రెవెన్యూపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశముండటంతో.. ఒకరు వెనక్కి తగ్గేలా మేకర్స్ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి 'ఈగల్' (Eagle) సినిమా వాయిదాకి అంగీకరించింది. ఈ చర్చల వెనుక ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ముఖ్య పాత్ర పోషించాడు. 'ఈగల్'కి సోలో రిలీజ్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన 'టిల్లు స్క్వేర్' ఈగల్ కి సైడ్ ఇస్తూ తప్పుకుంది. దీంతో 'ఈగల్' ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పుడు మరో కొత్త సమస్య తలెత్తింది.

సోలో విడుదల హామీతోనే 'ఈగల్' సినిమా సంక్రాంతి సీజన్ ని కాదనుకొని మరీ వాయిదాకి అంగీకరించింది. అయితే ఇప్పుడు 'ఈగల్'కి సోలో రిలీజ్ దొరకడం కష్టమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన 'టిల్లు స్క్వేర్' వాయిదాకి అంగీకరించింది కానీ అదే తేదీపై 'ఊరు పేరు భైరవకోన' (Ooru Peru Bhairavakona) కూడా కర్చీఫ్ వేసింది. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే 'ఊరు పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 9వ తేదీని లాక్ చేసుకున్నప్పటికీ, ఈగల్ చిత్రానికి ఆ డేట్ ని కేటాయించే విషయంలో తమను సంప్రదించలేదని నిర్మాత అనిల్ సుంకర తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 9 కే 'ఊరు పేరు భైరవకోన'ను విడుదల చేసే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం. అదే జరిగితే తమ త్యాగానికి తగ్గ ఫలితం దక్కలేదని ఈగల్ నిర్మాతలు కూడా హర్ట్ అయ్యే అవకాశముంది. మరి ఈ సమస్యను దిల్ రాజు పరిష్కరిస్తారేమో చూడాలి.
![]() |
![]() |