![]() |
![]() |

తెలుగు సినిమారంగంలో ఫైట్స్ లోనూ, డాన్సుల్లోనూ స్పీడ్ చూపించి, ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కెరీర్ లో ఎన్నెన్నో ఘనవిజయాలు, అనేక రికార్డులు చోటు చేసుకున్నాయి. యన్టీఆర్, కృష్ణ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా సాగిన చిరంజీవిని కేంద్రప్రభుత్వం 'పద్మభూషణ్' అవార్డుతో సత్కరించింది. తన తరం టాలీవుడ్ హీరోల్లో 'పద్మభూషణ్' అందుకున్న ఏకైక నటుడుగా నిలిచారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆయనను 'రఘుపతి వెంకయ్య అవార్డు'కు కూడా ఎంపిక చేసింది. అంతటి చరిత్ర ఉన్న చిరంజీవి ఘనతకు ఆయన అభిమానులే తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవికి ఇప్పటికే పలు రికార్డులు సొంతమయ్యాయి. అలాంటి చిరంజీవికి ఓ పరమచెత్త రికార్డును క్రియేట్ చేసే ప్రయత్నంలో ఆయన అభిమానులు సాగుతున్నారు. అదేమిటంటే 2023 జనవరి 13న చిరంజీవి హీరోగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సినిమా విడుదలయి, విజయఢంకా మోగించింది. ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించిన మాట వాస్తవం! అయితే 'వాల్తేరు వీరయ్య'ను వందరోజులు ఆడించడానికి అష్టకష్టాలు పడ్డారు. పోటీ సినిమాగా వచ్చిన బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' కన్నా మిన్నగా వసూళ్ళు చూసిన ఈ చిత్రం నూరు రోజుల రన్నింగ్ లో మాత్రం బాలయ్య సినిమాకంటే తక్కువ సెంటర్స్ చూసింది. అయినప్పటికీ చిరంజీవి అభిమానులు 'వాల్తేరు వీరయ్య'ను కృష్ణాజిల్లా అవనిగడ్డలో, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గ్యాప్ లతో వందరోజులు ఆడిందనిపించారు. అవనిగడ్డ సెంటర్ లో 'వాల్తేరు వీరయ్య' ప్రదర్శితమైన రామకృష్ణ థియేటర్ ను ఆ తరువాత మూసేశారు. మూసివేత మధ్యలో ఆగస్టు 18 నుండి "జిలేబి" అనే సినిమాని ఒక మూడు రోజులు ప్రదర్శించారు. 'వాల్తేరు వీరయ్య'కు ముందు కూడా అది మూసేసి ఉన్న థియేటరే! అయినప్పటికీ మూసివున్న థియేటర్ ముందు వాల్ పోస్టర్ పెట్టి, ఆ సినిమా ప్రదర్శితమవుతున్నట్టు కలర్ ఇచ్చి, ద్విశతదినోత్సవం ఆడిందని ప్రకటించుకున్నారు. పైగా నిర్మాతలు 'వాల్తేరు వీరయ్య' విజయోత్సవాన్ని వందరోజుల వేడుకలా జరుపుతూ ఉంటే, వేడుకకి కొద్ది గంటల ముందు రెండువందల రోజుల వేడుకగా మార్పు చేసి నిర్వహించేలా చేశారు.

అదే అయోమయం అనుకుంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులు 'వాల్తేరు వీరయ్య'ను రాబోయే జనవరి 9న సంవత్సరం పాటు ఆడినట్టు 'గోల్డెన్ జూబ్లీ' నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు అభిమాన సంఘాల అధ్యక్షుడి పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆడని సినిమాను ఆడిందని ప్రకటించుకోవడంలో వచ్చే ఆనందమేంటో అర్థం కావడం లేదు. ఇలా థియేటర్లు మూసేసి మా సినిమా అన్ని రోజులు ఆడింది, ఇన్ని రోజులు నడిచింది అంటూ డబ్బా కొట్టుకోవడంలో అభిమానులకు ఒరిగే ఆనందం ఏంటో కూడా తెలియడం లేదు. సేవాసంస్థ పేరున ప్రభుత్వం దగ్గర తీసుకున్న స్థలంలో కూర్చుని ఆడని సినిమాలను ఆడించినట్టుగా ఫ్లెక్సీలు, పోస్టర్స్ వేసి, వాటిలో బొమ్మలు వేసుకొని సందడి చేయడం పట్ల, సేవాదృక్పథం దృష్టితో ఇచ్చిన స్థలాన్ని దుర్వినియోగం చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకు గాను ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనీ కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఇవన్నీ చూస్తే, చిరంజీవి లాంటి మెగాస్టార్ ప్రతిభకు, ఖ్యాతికి ఆయన అభిమానులే తూట్లు పొడిచినట్టు అవుతుంది. అయినా ఆడిందని డబ్బా కొట్టుకొనేవారిని ప్రభుత్వాలైనా ప్రశ్నించాలి. ఎందుకంటే ఓ థియేటర్లో ఓ సినిమా ఆడిన రోజులు, వచ్చిన ఆదాయంపై జీఎస్టీ రూపంలో వినోదపు పన్ను కట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా వినోదపు పన్ను కట్టలేదు. ఎందుకంటే థియేటర్ మూసేసి ఉంది కదా! మరి సినిమా ఆడకపోయినా, ఆడిందని ప్రకటించుకొని డబ్బా కొట్టుకొనే వారికి సహకరిస్తున్న థియేటర్ వారిని ఈ విషయంలో వినోద/వాణిజ్య పన్నుల శాఖ వారు ప్రశ్నించి తీరవలసిందే కదా!

ఈ విషయంలో నిర్మాతలు, పంపిణీదారుల పాత్ర ఏమిటా అని ఆరా తీస్తే, వారు వెన్నెముక లేనట్టుగా చేతులెత్తేశారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఇదే నిర్మాతలు నిర్మించిన బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' విషయంలో బాలయ్య అభిమానులు ఇదేమిటని నిర్మాతలను సంప్రదిస్తే - 'మీరు కూడా వాళ్ళ లాగే ఉత్తుత్తిగా ఆడుకోండి' అని ఉచిత సలహా ఇచ్చి ఆ మేరకు సహకరిస్తున్నట్టు సమాచారం.
'వాల్తేరు వీరయ్య' కంటే ఒకరోజు ముందుగా అంటే 2023 జనవరి 12న బాలకృష్ణ సినిమా 'వీరసింహారెడ్డి' విడుదలైంది. దానిని కూడా బాలకృష్ణ అభిమానులు లాగించే ప్రయత్నం చేస్తున్నారు. 'వీరసింహారెడ్డి'ని కర్నూలు జిల్లా ఆలూరులో లాగిస్తున్నట్టు సమాచారం. తెలుగునాట బాలకృష్ణ కూడా మేటి హీరోగా అనేక రికార్డులు సాధించారు. అంటే ఆయన అభిమానులు సైతం బాలయ్య ప్రతిష్ఠకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట! టాలీవుడ్ లో టాప్ హీరోస్ అనగానే ఈ నాటికీ చప్పున గుర్తుకు వచ్చేవారు చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే! అలాంటి మేటి హీరోల ఇమేజ్ కు వారి ఫ్యాన్సే గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం, హీరోలయినా కళ్ళు తెరిచి ఈ చెత్త రికార్డుల బాగోతానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని సినీఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ ఫ్యాన్స్ పిచ్చి చేష్టలను ఖండిస్తారో లేక ప్రోత్సహిస్తారో చూడాలి.
![]() |
![]() |