![]() |
![]() |
పెళ్లి సందడితో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆమె చేతిలో ఓ డజను సినిమాలు ఉండొచ్చు. మొదటి రెండు సినిమాలు పెళ్లిసందడి, ధమాకా సూపర్‌హిట్ కావడంతో ఆమెకు ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో అదీ, ఇదీ అని కాకుండా అన్ని సినిమాలను ఓకే చేసేసింది. శ్రీలీల సినిమాలో ఉంటే అది హిట్టేనన్న సెంటిమెంట్ దర్శకనిర్మాతల్లో ఏర్పడిరది. అయితే ఆ తర్వాత రామ్‌తో చేసిన స్కంద, వైష్ణవ్‌తేజ్‌తో చేసిన ఆదికేశవ, నితిన్‌తో చేసిన ఎక్‌ట్రా సినిమాలు డిజాస్టర్లు కావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే వాటి మధ్యలో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు. అయితే బాలకృష్ణ కూతురుగా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. కొన్ని ఫ్లాపుల తర్వాత ఆమెకు ఊరటనిచ్చిన సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం మహేష్ బాబు, పవన్‌కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
సినిమాల విషయం పక్కన పెడితే.. డాక్టర్ కావాలన్నది శ్రీలీల లక్ష్యం. అందుకే సినిమాలు చేస్తూనే చదువును కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఊపిరి సలపనన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం రెండు నెలలపాటు తను చేసే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. పరీక్షలకు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడం కోసం షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వడం తప్పనిసరి అని భావించిన శ్రీలీల తన నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పిందట. వారు కూడా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడంతో ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్‌కి రెడీ అయింది
ఇప్పుడీ విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది. శ్రీలీల తీసుకున్న నిర్ణయానికి దర్శకనిర్మాతలు, ఇండస్ట్రీ షాక్ అయింది. తనకి సినిమాల కంటే చదువే ముఖ్యమని భావించిన శ్రీలీల తన మనసు మార్చుకుందని తెలుస్తోంది. తనకి ఫేమ్‌ని తీసుకొచ్చిన సినిమాలను నిర్లక్ష్యం చేయొద్దని, తనను నమ్మి సినిమాలు తీస్తున్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దని భావించిందో ఏమో.. షూటింగులకు రెండు నెలల గ్యాప్ తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అవసరమైతే సప్లిమెంటరీ రాసుకుంటానని చెప్పి ఎంత వేగంగా అయితే బ్రేక్ తీసుకుందో.. అంతే వేగంగా వెనక్కి వచ్చి షూటింగ్‌లో పాల్గొంటోంది. నిర్మాతల శ్రేయస్సు కోరి ఆమె తీసుకున్న నిర్ణయానికి నిర్మాతలు ఒక విధంగా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకొని ఆమె చేసిన ఈ పనిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
![]() |
![]() |