![]() |
![]() |

ఇప్పుడున్న స్టార్ హీరోలకు హీరోయిన్లను వెతకడం అంటే చిన్న విషయం కాదు. దేశమంతా జల్లెడపెట్టి వెతికి ఏ ముంబై నుంచో దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. యంగ్ స్టార్స్ విషయమే ఇలా ఉంటే ఇక సీనియర్ స్టార్స్ సంగతి వేరేగా చెప్పాలా? వారి అవసరాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. వారికి జోడిగా నటించే హీరోయిన్‌ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. దాంతో వారిలో వారిని రిపీట్ చేసుకుంటూ వస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోల సరసన బ్యూటీస్ నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అలాంటి సమయంలో దానిని సద్వినియోగం చేసుకుంటూ శ్రుతి హాసన్ సరికొత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' వరకు యంగ్ హీరోల సరసన నటించాలని ఆరాటపడిన ఈమె 'గబ్బర్ సింగ్' హిట్టుతో యంగ్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత మరలా ప్రేమ, సహజీవనం అంటూ కొంత కాలం కెరీర్ కి గ్యాప్ ని ఇచ్చింది. ఈ గ్యాప్ లో ఆమె కెరీర్ మరలా ఫెడ్ అవుట్ అయింది.
దాన్నుంచి బయటపడటానికి ఆమె ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ ఇద్దరితో జోడి కడుతోంది. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవికి, 'వీరసింహారెడ్డి'లో బాలయ్య బాబుకు జతకట్టింది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ లో అంటే జనవరి 12, 13 తారీకుల్లో విడుదల కానున్నాయి. ఈమె తాజాగా 'క్రాక్'తో గాడిలో పడింది. 'వీరసింహారెడ్డి'కి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో 'క్రాక్'లో నటించిన ఆమె మరోసారి ఆయన చిత్రంతోపాటు 'బాబీ' చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ హీరోల సరసన నటించిన ఈ సినిమాలు గానీ మంచి హిట్ అయితే ఆమెకు భవిష్యత్తులో సీనియర్ స్టార్లైన చిరు, బాలయ్య, నాగ్, వెంకీల నుంచి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మరో పక్క ఈమె యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'సలార్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రానికి 'కేజీఎఫ్; ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ సినిమా కూడా హిట్ అయితే ఆమెకు మరలా యంగ్ స్టార్స్ సరసన కూడా అవకాశాలు రావచ్చు. ఇలా ఈమె అనుకోకుండా బూరెల బుట్టలో పడింది. ఇక సీనియర్ స్టార్స్ సరసన నటించడం అంటే చాలా రిస్క్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఈమె రెమ్యునరేషన్ను నిర్మాతల నుంచి పిండుకుంటుంది. అదృష్టవశాత్తు 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' రెండు చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాతలు. దాంతో ఈ రెండు చిత్రాలకు కలిపి ఆమె ప్యాకేజీగా ఐదు కోట్లు తీసుకుందని సమాచారం. ఈ రెండు చిత్రాలు హిట్ అయి ఆ తర్వాత 'సలార్' కూడా హిట్ అయితే ఈమె పారితోషకం కూడా మరోసారి రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరి చూద్దాం.. శ్రుతి హాసన్ కోరిక ఫలిస్తుందో లేదో...? ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో శ్రుతి హాసన్ కెరీర్ లో వచ్చిన ఒడిదుడుకులను గతంలో ఏ యంగ్ హీరోయిన్ కూడా ఫేస్ చేయలేదు అని చెప్పాలి. ఫేస్ చేసినా కూడా ఈమెలా మరల కంబ్యాక్ అయిన వారు చాలా తక్కువ శాతం మాత్రమే. వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ విధంగా చూసుకుంటే శ్రుతికి ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి వస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |