![]() |
![]() |

తెలుగు తెరను ఏలుతున్న కన్నడ భామ కృతి శెట్టి. ప్రస్తుతం ఆమె డిమాండ్ మామూలుగా లేదు. నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ చాలా సినిమాల్లో చేస్తోన్న ఆమె, రామ్ జోడీగా ఈనెల 14న 'ది వారియర్' మూవీతో మన ముందుకు వస్తోంది. అయినా తనకు చాలా గ్యాప్ వచ్చినట్లు ఫీలవుతోంది. 'శ్యామ్ సింగరాయ్' 2021 డిసెంబర్‌లో, 'బంగార్రాజు' 2022 జనవరిలో.. వరుసగా వచ్చాయి. ఇప్పుడు ఆరు నెల్ల గ్యాప్‌తో 'ది వారియర్' వస్తోంది కాబట్టి చాలా గ్యాప్ వచ్చినట్లుగా ఉందనేది ఆమె ఫీలింగ్.
డైరెక్టర్ లింగుసామి డైరెక్ట్ చేసిన 'ఆవారా' సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం. ఎంతిష్టమంటే వాళ్లమ్మమ్మ వాళ్లింటికి వెళ్లినప్పుడల్లా 'ఆవారా' మూవీ సీడీ తీసుకొని వెళ్లేదంట. "ఒక్కోరోజు దాన్ని రెండు మూడు సార్లు చూసిన సందర్భాలున్నాయి. లింగుసామి ఫోన్ చేశారని చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఎందుకంటే.. ఆయన సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. 'ది వారియర్' కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జయిట్ అయ్యాను" అని చెప్పింది కృతి శెట్టి.
'ది వారియర్' తర్వాత ఆమె నితిన్ సరసన నటించిన 'మాచర్ల నియోజకవర్గం'తో ఆగస్ట్‌లో మన ముందుకు రానున్నది. ఏ సినిమానైనా ఆమె ఏం చూసి యాక్సెప్ట్ చేస్తుంది? "కథ వినేటప్పుడు నేను ఎంటర్‌టైన్ అయితే, ఆడియెన్స్ కూడా ఎంటర్‌టైన్ అవుతారని అనుకుంటాను" అనేది ఆమె జవాబు. యాక్షన్ రోల్ చేయాలనేది ఆమె కోరిక. "అయితే ఇప్పుడే కాదు, కొన్నేళ్ల తర్వాత యాక్షన్ రోల్ చేయాలనుంది. ఫిమేల్ సెంట్రిక్ స్క్రిప్ట్స్ ఏవీ వినలేదు" అంటోంది ఈ బ్యూటీ. మొత్తానికి కృతి కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. తను ఎంటర్‌టైన్ అయిన కథలతో మనల్ని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్న ఆమెకు మరికొంత కాలం దాకా తిరుగుండనట్లే.
![]() |
![]() |