![]() |
![]() |

ఇటీవల 'సర్కారువారి పాట' సినిమా విడుదలకు ముందు మహేశ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని అతని కామెంట్ ఒకటి కాంట్రవర్సీ సృష్టించింది. తనకు తెలుగు చిత్రసీమను వదిలి హిందీ చిత్రసీమకు వెళ్లాల్సిన అవసరం లేదనీ, అయినా బాలీవుడ్ తనను భరించలేదనీ మహేశ్ చెప్పడంతో బాలీవుడ్ మీడియా దానిపై రకరకాల వ్యాఖ్యలు, విశ్లేషణలు చేసింది. మహేశ్‌పై నెగటివిటీని వ్యాప్తి చేసింది. అయితే మహేశ్ ఏ సందర్భంలో ఆ మాట అన్నాడో తెలీకపోయినా, ఆయన అన్న మాటల్లో యథార్థం ఉందని కంగన రనౌత్ లాంటి వాళ్లు వెనకేసుకువచ్చారు.
మహేశ్ ఇప్పుడే కాదు, తన కెరీర్ ప్రారంభం నుంచీ తను తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్తూ వస్తున్నాడు. దేశంలోనే అత్యంత అందగాళ్లలో ఒకడిగా పేరు పొందడంతో 'హిందీలోనూ నటిస్తారా?' అనే ప్రశ్న మొదట్నుంచీ అతను ఎదుర్కొంటూ వస్తున్నాడు. 'అతిథి' (2007) సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ అతడికి ఈ ప్రశ్న ఎదురైంది.
"బాలీవుడ్, హాలీవుడ్ వెళ్ళను. తెలుగు పరిశ్రమలోనే ఉంటా. తెలుగు సినిమా స్థాయిని పెంచాలనేదే నా ఉద్దేశం." అని సీరియస్‌గానే చెప్పాడు మహేశ్. అంటే ఈ విషయంలో మొదట్నుంచీ అతను చాలా క్లారిటీతో ఉన్నాడు. అతను ఎన్నిసార్లు ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేసినా, ప్రతి సినిమా ప్రమోషన్‌లోనూ పదే పదే ఇదే ప్రశ్నను అతను ఎదుర్కొంటూ వస్తున్నాడు. మాటంటే మాటే అన్నట్లు అతనూ ప్రతిసారీ ఒకే జవాబు చెప్తూ వస్తున్నాడు.
కాగా తెలుగు సినిమా బడ్జెట్ ఇటీవలి కాలంలో విపరీతంగా పెరగడం ఇండస్ట్రీలోని చాలామందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. బడ్జెట్‌కు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పెరగడం, సినిమా రిలీజయ్యాక అందుకు అనుగుణంగా కలెక్షన్లు లేక, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తీవ్ర నష్టాలకు గురవడం జరుగుతోంది. మహేశ్ సినిమాలూ ఇందుకు మినహాయింపు కాదు.
'అతిథి' టైమ్‌లోనే, "తెలుగు సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం అందరం. ఎందుకంటే క్వాలిటీ కోసం పెరుగుతోంది. ఆ క్వాలిటీ నా సినిమాల్లో కనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ గురించి పక్కవాళ్లు మాట్లాడుకోవాలి. క్వాలిటీ పరంగా సినిమా అందరి దృష్టిని ఆకర్షించాలి. మన సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాలి. నిజం చెప్పాలంటే తమిళ సినిమా కంటే తెలుగు సినిమాయే క్వాలిటీ, మార్కెట్ పరంగా కూడా బెటర్. హిందీ తర్వాత అంత క్వాలిటీ తో తీసేది తెలుగూ సినిమాయే." అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేశ్.
![]() |
![]() |