![]() |
![]() |

పాపులర్ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్(కేకే) ఆకస్మిక మృతితో సంగీత ప్రపంచం షాక్‌కు గురైంది. మంగళవారం కోల్‌కతాలో నజ్రుల్ మంచా ఆడిటోరియంలో జరిగిన మ్యూజిక్ కాన్సెర్ట్‌లో ప్రదర్శన ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన ఆయన.. హాస్పిటల్‌కు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మరణాన్ని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగులోనూ ఎన్నో పాటలు పాడిన ఆయన ఇక్కడ కూడా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న పవన్.. కేకే మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"కేకేగా సుపరిచితులైన ప్రముఖ గాయకుడు శ్రీ కృష్ణకుమార్ కున్నత్ గారి అకాల మరణం బాధ కలిగించింది. సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణీని కలిగిన గాయకుడు శ్రీ కేకే గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చిత్రాల్లో ఆయన ఆలపించిన గీతాలు అభిమానులను, సంగీత ప్రియులను అమితంగా మెప్పించాయి. 'ఖుషీ' చిత్రంలోని 'ఏ మేరా జహా' గీతం అన్ని వయసులవారికీ చేరువైంది. అందుకు శ్రీ కేకే గారి గాత్రం ఓ ప్రధాన కారణం. 'జల్సా'లో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా', 'బాలు'లో 'ఇంతే ఇంతింతే', 'జానీ'లో 'నాలో నువ్వొక సగమై', 'గుడుంబా శంకర్'లో 'లే లే లే లే'.. గీతాలను నా చిత్రాల్లో ఆయన పాడారు. అవన్నీ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు... సంగీతాభిమానులు హమ్ చేసుకొనేలా సుస్థిరంగా నిలిచాయి. సంగీత కచేరీ ముగించుకొన్న కొద్దిసేపటికే హఠాన్మరణం చెందటం దిగ్భ్రాంతికరం. ఆయన చివరి శ్వాస వరకూ పాడుతూనే ఉన్నారు. శ్రీ కేకే గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి." అంటూ కేకే మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్.
![]() |
![]() |