Home

»

Latest News

ఏయ‌న్నార్ చివ‌రి చిత్రం `మ‌నం`కి 8 ఏళ్ళు!

May 23, 2022 11:13AM

అక్కినేని కుటుంబానికి పున‌ర్జ‌న్మ నేప‌థ్య చిత్రాలు భ‌లేగా క‌లిసొచ్చాయి. మ‌రీముఖ్యంగా.. న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అయితే ఈ త‌ర‌హా సినిమాల్లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో సంద‌డి చేశారు. ఇక ఏయ‌న్నార్ చివ‌రి చిత్ర‌మైన `మ‌నం` కూడా పున‌ర్జ‌న్మ‌ల క‌థాంశంతో తెర‌కెక్క‌డం విశేషం. త‌న త‌న‌యుడు కింగ్ నాగార్జున‌, మ‌న‌వ‌డు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఏయ‌న్నార్ న‌టించిన ఈ సినిమాలో అమ‌ల అక్కినేని, అఖిల్ అక్కినేని అతిథి పాత్ర‌ల్లో సంద‌డి చేశారు. అక్కినేని వారి మూడు త‌రాల క‌థానాయ‌కుల‌తో ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ రూపొందించిన ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెలుగువారిని విశేషంగా ఆక‌ట్టుకుంది.

నాగ్ కి జోడీగా శ్రియ‌, చైతూకి జంట‌గా సమంత న‌టించిన ఈ సినిమాలో శ‌ర‌ణ్య‌, బ్ర‌హ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయ‌ణ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, చ‌ల‌ప‌తి రావు, పోసాని కృష్ణ ముర‌ళి, తేజ‌స్వి, స‌త్య‌కృష్ణ‌న్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌గా..బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, లావ‌ణ్య త్రిపాఠి, రాశీ ఖ‌న్నా, నీతూ చంద్ర స్పెష‌ల్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

అనూప్ రూబెన్స్ సంగీతమందించిన ఈ చిత్రంలో.. ``క‌నుల‌ను తాకే ఓ క‌ల‌``, ``చిన్ని చిన్ని ఆశ‌లు``, ``క‌నిపెంచిన మా అమ్మ‌కే``, ``ఇది ప్రేమ‌``,  ``మ‌నం`` (థీమ్), ``పీయో పీయో`` వంటి పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన `మ‌నం`.. 2014 మే 23న విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకోవ‌డ‌మే కాకుండా, ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. కాగా, ఏయ‌న్నార్ కి గొప్ప నివాళిగా నిలిచిన `మ‌నం`.. నేటితో 8 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com