![]() |
![]() |

'శంకరాభరణం', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం', 'ఆపద్బాంధవుడు', 'స్వయంకృషి', 'సితార' వంటి ఎన్నో క్లాసిక్స్ ని నిర్మించిన సంస్థ 'పూర్ణోదయ మూవీ క్రియేషన్స్'. ఈ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుటుంబం మళ్ళీ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో ఆయన మనవరాలు ఏడిద శ్రీజ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోంది. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'జాతిరత్నాలు' టీమ్ పనిచేస్తుండటం విశేషం.
'జాతిరత్నాలు' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కేవీ అనుదీప్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అలాగే 'జాతిరత్నాలు' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వంశీధర్, లక్ష్మీనారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడమే కాకుండా, ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా టైటిల్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ మూవీకి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ఈ సినిమా కూడా 'జాతిరత్నాలు' స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రుపొందుతున్నట్లు తెలుస్తోంది.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని మేకర్స్ తెలిపారు. అలాగే, పూర్ణోదయ సంస్థ ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిందని, ఆ క్లాసిక్స్ ని టచ్ చేయకుండా శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విభిన్న జోనర్స్ లో చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. రాధన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా ప్రశాంత్, ఎడిటర్ గా మాధవ్ వర్క్ చేస్తున్నారు. అనుదీప్ తో కలిసి ఈ చిత్రానికి డైరెక్టర్ వంశీధర్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.
![]() |
![]() |