![]() |
![]() |

తెలుగు జనాలు మెచ్చిన జంటల్లో నటభూషణ శోభన్ బాబు - అభినేత్రి సుహాసిని జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు కుటుంబ ప్రేక్షకుల మది దోచాయి. వాటిలో `పుణ్య దంపతులు` ఒకటి. విషాదాంత కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో పుణ్య దంపతులు డాక్టర్ కళ్యాణ్, జానకిగా శోభన్ బాబు, సుహాసిని ఆకట్టుకున్నారు. నూతన్ ప్రసాద్, వీరభద్రరావు, రమాప్రభ, జయమాలిని, కృష్ణవేణి, కల్పనా రాయ్, చిడతల అప్పారావు, పొట్టి ప్రసాద్, చిట్టిబాబు, శ్రీధర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఎం. శ్రీనివాస చక్రవర్తి కథను అందించగా.. `వియత్నాం వీడు` సుందరం స్క్రీన్ ప్లేని, పూసల సంభాషణలను సమకూర్చారు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు.
వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన గీతాలకు చక్రవర్తి బాణీలు కట్టారు. ``సిరిమల్లెమ్మ.. చిరునవ్వమ్మా..``, ``ఆ నింగి ఈ నేల ముద్దాకుంటున్న ఈ రాతిరి``, ``చల్లగా నవ్వాలి చందమామ``, ``తెలుగింటి చిలకమ్మా.. తెలవారే వెలుగమ్మా..``, ``ఎవరు నీకు``.. ఇలా ఇందులోని పాటలన్నీ అలరించాయి. బి.బుల్లి సుబ్బారావు, కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన `పుణ్య దంపతులు`.. 1987 మే 14న విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పొందింది. నేటితో ఈ చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |