![]() |
![]() |

మహేశ్‌బాబు 'సర్కారువారి పాట' బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ రికార్డుల వేటను ప్రారంభించింది. తొలి రోజు రూ. 75 కోట్ల గ్రాస్‌ను ఈ మూవీ సాధించింది. యు.ఎస్.లో మహేశ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసిందే. ఇప్పటికే 'సర్కారువారి పాట' అక్కడ 1.5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. అంటే రూ. 11 కోట్లు వచ్చాయన్న మాట. మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో మహేశ్ కామెడీ టైమింగ్‌ను, ఆయన డైలాగ్స్, డాన్స్, యాక్షన్‌ను ఆడియెన్స్ ఆస్వాదిస్తున్నారు.
ఒక బ్యాంకుకు రూ. 10 వేల కోట్లు ఎగవేసిన రాజేంద్రనాథ్ అనే ఒక బడా పారిశ్రామికవేత్తపై పోరాటం చేసిన మహేశ్ అనే ఫైనాన్స్ వ్యాపారి కథతో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తమన్ సమకూర్చిన మ్యూజిక్ ఒక హైలైట్‌గా నిలిచింది. 'కళావతి', 'పెన్నీ', 'మం మం మహేశా' సాంగ్స్ చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. శనివారంతో 'సర్కారువారి పాట' రూ. 100 కోట్ల గ్రాస్‌ను సునాయాసంగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులకు పని చెప్పింది. శుక్రవారం రాత్రి ఈ సినిమా నిర్మాతలు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి భార్య నమ్రతతో కలిసి వచ్చిన మహేశ్ చాలా ఆనందంగా కనిపించాడు.
మరోవైపు, రణవీర్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జయేష్‌భాయ్ జోర్దార్' మొదటి రోజు ఇండియాలో కేవలం రూ. 3 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అంటే బాలీవుడ్లో మరో డిజాస్టర్ రెడీ అయినట్లే.
'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్. త్రివిక్రమ్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా, రాజమౌళి సినిమా 2023లో ప్రారంభం కానున్నది.
![]() |
![]() |