![]() |
![]() |

కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుండే అగ్ర కథానాయకుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అలా రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఆ చిత్రమే.. 'భద్ర'. ఇద్దరి కెరీర్ లోనూ ఓ మెమరబుల్ మూవీగా నిలిచిన ఈ బ్లాక్ బస్టర్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధినేత `దిల్` రాజు నిర్మించారు. రవితేజకి జోడీగా మీరా జాస్మిన్ నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో దీపక్, ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, మురళీ మోహన్, సునీల్, బ్రహ్మాజీ, పద్మనాభం, ఈశ్వరీరావ్, రేవతి, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``తిరుమలవాసా``, ``ఏమైందీ సారూ``, ``జస్ట్ డూ ఇట్``, ``నువ్వు నాకు మనసిస్తే``, ``ఓ మనసా``, ``ఎర్రకోక పచ్చరైక``, ``ఏవూరే చినదానా``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది. తమిళంలో `శరవణ` (శింబు, జ్యోతిక), కన్నడంలో `గజ` (దర్శన్, నవ్యనాయర్), బెంగాలీలో `జోష్` (జీత్, స్రబంతి మలకర్), బంగ్లాదేశీలో `భలోబేషే మోర్టే పరి` (షకీబ్ ఖాన్, సహారా) పేర్లతో `భద్ర` రీమేక్ అయింది. 2005 మే 12న విడుదలై ఘనవిజయం సాధించిన `భద్ర`.. నేటితో 17 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |