![]() |
![]() |

సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి అవమానకర రీతిలో 'ఆచార్య' రూపంలో డిజాస్టర్ ఎదురయ్యింది. 'ఖైదీ నంబర్ 150' మూవీతో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు ఆ సినిమా భారీ కలెక్షన్లను సాధించి, బయ్యర్లకు లాభాలు చేకూర్చింది. ఆ తర్వాత ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా.. నరసింహారెడ్డి'ని చేశారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఆ మూవీ మిగతాచోట్ల ఆడకపోయినా తెలుగునాట మంచి వసూళ్లను సాధించింది. నటునిగా చిరుకు 'సైరా' చక్కని పేరు తెచ్చింది.
ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన 'ఆచార్య'పై ఇటు ఆడియెన్స్‌లో, అటు బిజినెస్ వర్గాల్లో తెగ ఆసక్తి నెలకొంది. రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో నటించడం సినిమాపై క్రేజ్ తెచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందే 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ చాప్టర్ 2' లాంటి పాన్ ఇండియా క్రేజ్ సినిమాలు రావడం, ఆ రెండూ బ్లాక్‌బస్టర్స్ కావడం 'ఆచార్య'పై ఒత్తిడిని పెంచాయి. అప్పటికే జనం జేబులు ఖాళీ కావడం, అనూహ్యంగా 'ఆచార్య' ట్రైలర్ బజ్‌ను తగ్గించేయడం మైనస్ అయ్యాయి.
అయినప్పటికీ సినిమా విడుదలైతే, అనుమానాలన్నీ పటాపంచలవుతాయనీ, తండ్రీకొడుకులు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతారనీ మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. సినిమా రిలీజయ్యాక పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉన్న కథా కథనాలు, క్యారెక్టరైజేషన్స్, రామ్‌చరణ్ చేసిన సిద్ధ క్యారెక్టర్ చనిపోయే తీరు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. చిరంజీవి ఆహార్యం, ఆయన పాత్ర కూడా ఆడియెన్స్‌ను అలరించలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 107 కోట్ల ప్రి బిజినెస్ చేసుకున్న 'ఆచార్య'కు నాలుగోరోజే అత్యంత దారుణంగా కేవలం రూ. 53 లక్షల షేర్ రావడం ఊహాతీతమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిరు, చరణ్ నటించిన మల్టీస్టారర్‌కు నాలుగో రోజు కోటి రూపాయల షేర్ కూడా రాకపోవడం సినిమా ఏ స్థాయి డిజాస్టరో తెలియజేస్తోందని అవి చెప్తున్నాయి. తెలుగునాట మొదటిరోజు శుక్రవారం రూ. 29.50 కోట్ల షేర్ వసూలుచేసిన ఆచార్య, రెండో రోజు రూ. 5.15 కోట్లు, మూడో రోజు రూ. 4.07 కోట్ల షేర్ వసూలు చేసింది. వెరసి.. 4 నాలుగు రోజులకు రూ. 39.25 కోట్లు రాబట్టింది. అంటే అత్యంత భారీ డిజాస్టర్ దిశగా ఆచార్య పయనిస్తోందని అర్థమైపోయింది.
ఎన్నో ఆశలతో తండ్రీ కొడుకులు చేసిన సినిమా ఇలా ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. చిరంజీవి సహా మెగా కాంపౌండ్ అంతా 'ఆచార్య' రిజల్ట్‌కు డీలా పడిపోయారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా ఉండగా, ఇప్పుడు దాని సరసన 'ఆచార్య' కూడా నిలవనుండటం వారిని కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో రానున్న సినిమాలపై చిరు మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |