![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేశారు. వాటిలో 'బంగారం' (2006) ఒకటి. 'ఖుషి' (2001) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం కాంబినేషన్ లో పవన్ చేసిన చిత్రమిది. ఈ సినిమాతోనే కోలీవుడ్ కెప్టెన్ ధరణి తెలుగునాట తొలి అడుగేశారు. అంతర్జాతీయ న్యూస్ ఛానల్ బీబీసీ లో చేరాలని కలలు కనే రిపోర్టర్ బంగారం పాత్రలో పవన్ నటన అభిమానులను ఆకట్టుకుంది. మీరా చోప్రా, రాజా, సనూష, ముకేశ్ రిషి, అశుతోశ్ రాణా, తనికెళ్ళ భరణి, రఘుబాబు, అలీ, వేణుమాధవ్, శ్రీనివాస రెడ్డి, సంతోషి, షకీలా, ఏవీయస్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు సుబ్రమణ్యం ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో త్రిష, రీమా సేన్ అతిథి పాత్రల్లో ఆకట్టుకున్నారు. రచనా మౌర్య ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
విద్యాసాగర్ సంగీతమందించిన ఈ చిత్రానికి భువనచంద్ర, సాహితి సాహిత్యమందించారు. ఇందులోని టైటిల్ సాంగ్ తో పాటు "ఎగిరే చిలకమ్మా", "చెడుగుడంటే", "మారో మస్తి మారో", "జై శంభో శంభో" అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. 2006 మే 3న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న 'బంగారం'.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |