![]() |
![]() |

``చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్`` - అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేసిన చిత్రం `సింహా`. `భద్ర` (2005), `తులసి` (2007) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా.. దర్శకుడిగా బోయపాటికి హ్యాట్రిక్ ని అందించింది. అలాగే, బాలయ్య - బోయపాటి సంచలన కలయికకి శ్రీకారం చుట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. తండ్రీకొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం, దర్శకుడు బోయపాటి శ్రీను టేకింగ్ `సింహా`కి ప్రధాన బలంగా నిలిచాయి. మరీముఖ్యంగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర డాక్టర్ నరసింహ (బాలకృష్ణ)ని బోయపాటి తీర్చిదిద్దిన విధానం.. ఆ వేషంలో నెవర్ సీన్ బిఫోర్ డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ తో బాలయ్య అలరించిన తీరు జనత మన్ననలు పొందింది. అదే విధంగా, `ఉత్తమ నటుడు` విభాగంలో మరో `నంది` పురస్కారం నందమూరి బాలయ్య చెంతకు చేరింది.
బాలయ్యకి జంటగా నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో కేఆర్ విజయ, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, వేణు మాధవ్, ఝాన్సీ, రెహ్మాన్, సాయికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. చక్రి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి, చంద్రబోస్, భాస్కరభట్ల సాహిత్యమందించారు. ``సింహమంటి చిన్నోడు``, ``బంగారు కొండ``, ``జానకి జానకి``, ``ఓరబ్బా``, ``కనులారా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన `సింహా`.. `ఉత్తమ నటుడు` (బాలకృష్ణ), `ఉత్తమ సంగీత దర్శకుడు` (చక్రి), `ఉత్తమ హాస్య నటి` (ఝాన్సీ) విభాగాల్లో `నంది` పురస్కారాలు అందుకుంది. 2010 ఏప్రిల్ 30న విడుదలై ఆ యేటి మేటి చిత్రంగా నిలిచిన `సింహా`.. నేటితో 12 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |