![]() |
![]() |

తెలుగునాట `యముడు` చుట్టూ తిరిగే ఫాంటసీ కథలు భలేగా ఆకట్టుకున్నాయి. వాటిలో `యమలీల` చిత్రం ఒకటి. హాస్యనటుడు అలీని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. యముడుగా కైకాల సత్యనారాయణ నటించిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం వినోదాలు పంచారు. ఇంద్రజ కథానాయికగా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, మంజు భార్గవి, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, ఏవీయస్, లతాశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. అలాగే, సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక గీతంలో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా ``సిరులొలికించు``, `నీ జీనూ ఫ్యాంటు చూసి బుల్లోడో`` చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. కృష్ణ, పూజపై చిత్రీకరించిన ``జుంబారే`` సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదేవిధంగా ``ఎర్రా కలువ పువ్వా``, ``అభి వందనం`` గీతాలు కూడా రంజింపజేశాయి. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిశోర్ రాఠి, కె. అచ్చిరెడ్డి నిర్మించిన `యమలీల`.. హిందీలో `తఖ్ దీర్ వాలా` (విక్టరీ వెంకటేశ్, రవీనా టాండన్), తమిళంలో `లక్కీ మ్యాన్` (కార్తిక్, సంఘవి) పేర్లతో రీమేక్ అయింది. 1994 ఏప్రిల్ 28న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `యమలీల`.. నేటితో 28 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |