![]() |
![]() |

తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన హాస్య నటుల్లో ఏవీయస్ ఒకరు. అందుకే... భౌతికంగా ఏవీయస్ మనకు దూరమై దశాబ్దం కావస్తోందంటే "ఔనా.." అని ఆశ్చర్యమనిపిస్తుంది. కెరీర్ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తరుణంలో 2013లో అనారోగ్యంతో ఏవీయస్ అర్ధాంతరంగా మృతి చెందారు. ఇప్పుడు ఆయన లేని లోటు తీర్చేందుకు సమాయత్తమవుతున్నారు ఆయన తనయుడు ఏవీయస్ ప్రదీప్.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తన తండ్రి ఏవీయస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తన తండ్రి పేరు ఏవీయస్‌ను తన పేరు ముందు చేర్చుకుని.. ఆయనలాగే పేరు తెచ్చుకుని.. ముందుకు సాగాలని కంకణం కట్టుకున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసిన ఏవీయస్ ప్రదీప్ కొన్నాళ్ళు ఎయిర్టెల్ కలెక్షన్ ఏజెన్సీ నిర్వహించారు. సొంతంగా యాడ్ ఏజెన్సీ సైతం నడిపిన ఏవీయస్ ప్రదీప్.. పలు పేరొందిన సంస్థలకు యాడ్ ఫిల్మ్స్ చేసి, తన ప్రతిభను నిరూపించుకున్నారు.
కరానా క్రైసిస్ టైమ్ లోనూ తన క్రియేటివిటీకి పదును పెట్టి.. 'యాక్టివ్ స్టూడియోస్' పేరిట యుట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి... అన్నాచెల్లెళ్లయిన తన ఇద్దరు చిన్నారులతో వందకు పైగా ఎపిసోడ్స్ చేసి మెప్పించారు. 'వైదేహి' పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి.. దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్న ఏవీయస్ ప్రదీప్.. 'భళా చోర భళా', 'కాంట్రాక్ట్' అనే మరో రెండు చిత్రాలు సైతం తెరకెక్కించారు. వినూత్న కథాంశాలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఏవీయస్ ప్రదీప్.. ఇకపై పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారించాలని డిసైడయ్యారు.

"నటుడిగా రాణించగలననే నమ్మకం నాపై నాకు పూర్తిగా కలిగాకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్న ఏవీయస్ ప్రదీప్.. తన తండ్రి లేని లోటు ఎంతో కొంత తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెబుతున్నారు. "కమెడియన్ గానైనా... విలన్ గానైనా... ఏ క్యారెక్టర్ ఇచ్చినా రక్తి కట్టించి.. దర్శకులు-నిర్మాతల మెప్పు పొందగలన"నే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు ఏవీయస్ ప్రదీప్.
![]() |
![]() |